Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రికార్డు

By:  Tupaki Desk   |   18 July 2020 8:30 AM GMT
దేశంలోనే తొలిసారి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రికార్డు
X
మహమ్మారి వైరస్ యోధులుగా వైద్యులు నిలుస్తున్నారు. ఆ వైరస్ నుంచి ప్రజలను కాపాడేవారే ఆ మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వైద్యులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఓ సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఆ ఆవిష్కరణ అందరి ప్రశంసలు పొందుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ ఆవిష్కరణకు రెండో బహుమతి దక్కడం విశేషం. ఈ విధంగా ఆవిష్కరణ చేసి బహుమతి పొందిన తొలి ఎమ్మెల్యే ఆమెనే కావొచ్చు.

కోవిడ్‌–19 పరీక్ష, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డీసీ) పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు వెళ్లిన వాటిలో ఏపీ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండే క్యాబిన్‌ ను ఎంటెక్‌ చదివిన ఎమ్మెల్యే పద్మావతి రూపొందించారు. ఆ క్యాబిన్ అందర్నీ ఆకర్షించింది.

ఆ క్యాబిన్‌‌లో వైరస్‌ చొరబడటానికి అవకాశం లేకుండా తయారు చేశారు. పీపీఈ కిట్లు లేకుండా డాక్టర్లు క్యాబిన్‌లోకి ప్రవేశించిన తర్వాత సురక్షితంగా ఉంటారు. ఈ క్యాబిన్‌ నుంచే వారు వైరస్ రోగులకు సేవలు అందించొచ్చు. వార్డుల్లో క్యాబిన్‌తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చేలా ఆ క్యాబిన్ ను సిద్ధం చేశారు. వైద్యుడు క్యాబిన్‌ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్‌ అవడం దీని ప్రత్యేకత. ఈ ఆవిష్కరణకే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.

అనంతపురంలోని ఎస్ఆర్ఐటీ, ఏలూరులోని రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఈ ఘనత సాధించాయి. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించారు. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులు రాగా 16 ఆవిష్కరణలు చేసిన వారు విజేతలుగా నిలిచారు. త్వరలోనే వారికి బహుమతులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే పద్మావతికి అవార్డు రావడంతో మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు అభినందిస్తున్నారు.