Begin typing your search above and press return to search.

యాగంపై నేషనల్ మీడియా ఏమంటోంది?

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:18 AM GMT
యాగంపై నేషనల్ మీడియా ఏమంటోంది?
X
తెరాస అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీయాగానికి తెలుగు మీడియా తెగ ప్రయారిటీ ఇస్తోంది. ఎవరెవరు వస్తున్నారు... ఏమేం చేస్తున్నారు... ఎలా చేస్తున్నారు అంటూ పూర్తిగా ఏకపక్షంగా కథనాలు వస్తున్న తరుణంలో నేషనల్ మీడియా మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. అందులో భిన్న కోణాలను బయటకు తీస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ చండీయాగం 27వ తేదీ వరకు జరగనుంది. అయితే... దీనికోసం కేసీఆర్ ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారని.... తెలంగాణలో రైతులు ప్రాణాలొదులుతున్న తరుణంలో ఇలాంటి ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నిస్తూ నేషనల్ మీడియలో కథనాలు వస్తున్నాయి.

కేసీఆర్ చండీయాగంపై నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు దేశవ్యాప్త చర్చకు దారితీస్తున్నాయి. కేసీఆర్ భారీ ఎత్తున దీన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఆ పక్కనే ఉన్న పేద రైతులను మాత్రం పట్టించుకోవడం లేదంటూ పలువురు అభిప్రాయాలతో కథనాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయి. యాగం జరుగుతన్న ఎర్రవెల్లికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని పీర్లపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు... ఆయన కుటుంబం పడుతున్న కష్టాలను ఆయా కథనాల్లో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న జనం పడుతున్న కష్టాలను మరిచి ఇలా యాగాల పేర్లతో కోట్లు ఖర్చు చేయడం కేసీఆర్ కే చెల్లిందంటూ మీడియాలో వస్తున్న సమాచారం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు తెలంగాణలోనూ సీపీఎం వంటి వామపక్ష పార్టీలు కేసీఆర్ ధోరణిని తప్పుపడుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని యాగం నిర్వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారు.యాగ నిర్వహణ వ్యక్తిగతం అని చెబుతూనే , రాజ్యాంగ వ్యవస్థలను తన ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన అన్నారు.. ముఖ్యమంత్రి రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదని అన్నారు. ప్రభుత్వం కుల మత భావాలు ప్రేరేపించే చర్యల్ని ప్రోత్సహించకూడదని, లౌకికతత్వాన్ని కాపాడటం పాలకుల బాధ్యత అని చెప్పారు. కేసీఆర్‌ వ్యక్తిగత పూజకు పరిమితం కాకుండా, రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి, ఇతర ప్రభుత్వ నేతలందర్నీ భాగస్వాముల్ని చేస్తున్నారని అన్నారు. ఖర్చు తానే భరిస్తున్నానని చెప్పడం వట్టి బూటకమని, యాగ స్థలం తప్ప ఏదీ ఆయన సొంతం కాదని అన్నారు. యాగ క్షేత్రంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది దగ్గరుండి పనులు చేయిస్తున్న విషయాన్ని విస్మరించరాదని వీరభద్రం ఆరోపించారు.ఆహ్వానపత్రాలు ఇవ్వడానికి హెలికాఫ్టర్లు వాడారని, ఆ ఖర్చు ఎవరు భరించారని ఆయన ప్రశ్నించారు.