Begin typing your search above and press return to search.

కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారట

By:  Tupaki Desk   |   15 July 2016 9:24 AM GMT
కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారట
X
అదేం చిత్రమో కానీ.. తెలుగు మీడియాలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నెగిటివ్ వార్తలు దాదాపుగా తగ్గిపోయాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో అన్నా కొద్దో.. గొప్పో ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపే వార్తలు వస్తున్నాయి. ఇక.. తెలంగాణలో అందుకు భిన్నమైన పరిస్థితి. అలా అని.. కేసీఆర్ పాలనలో అంతా చక్కగా జరుగుతుందా? అంటే లేదని నెత్తినోరూ కొట్టుకుంటోంది ఇంగ్లిష్ మీడియా. పలు అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న జాతీయ మీడియా తాజాగా విద్యుత్ రంగం విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది.

తమ వాదనకు తోడుగా.. కేంద్రం వ్యాఖ్యాల్ని కోట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యుత్ రంగంలో విపరీతమైన కొరతతో అల్లాడిన రాష్ట్రానికి కరెంటు కష్టాలు తీర్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. విద్యుత్ కొరతకు శాశ్వితంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న కేసీఆర్.. ఆ ప్రయత్నంలో చేస్తున్న తప్పుల్ని నిపుణులు.. కేంద్రం ఎత్తి చూపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఒక ప్రాజెక్టును.. నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. అయితే.. ఈ రెండు ప్రాజెక్టులు బొగ్గు ఆధారితంగానే విద్యుత్ ను ఉత్పత్తి చేసే పరిస్థితి. అయితే.. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు లభ్యత భవిష్యత్తులో కష్టమవుతుందని.. ఈ రెండు ప్రాజెక్టులు వృధా ఖర్చుతో కూడుకున్నవన్న విషయాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చెప్పినా పట్టించుకోకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాజెక్టుల కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం కూడా ఉత్పత్తి అవుతుందని.. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవటం వృధా ప్రయాసగా కేంద్రం తేల్చింది.

ఈ రెండు ప్రాజెక్టులను విడిచి పెట్టినా తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఉండదని.. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తాము అందిస్తామని.. అది కూడా సాధారణ ధర కంటే తక్కువకే అందిస్తామని చెప్పినా.. తెలంగాణ సర్కారు పట్టించుకోకపోవటం ఆసక్తికరంగా మారింది. దీనిపై జాతీయ మీడియాలో పలు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తున్న పరిస్థితి. కేంద్రం చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వినిపించుకోనట్లు..?