Begin typing your search above and press return to search.

కేసీఆర్ : ఆ హోదా అంత వీజీ కాదు నాయ‌నా !

By:  Tupaki Desk   |   15 Jun 2022 9:30 AM GMT
కేసీఆర్ : ఆ హోదా అంత వీజీ కాదు నాయ‌నా !
X
ప్ర‌స్తుతం అంతా కేసీఆర్ స్థాపించ‌బోయే జాతీయ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏపీలోనూ ఆయ‌న పోటీ చేసే ఛాన్సులు కొట్టిపారేయ్య‌లేం అని కూడా కొంద‌రు టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. అయినా ఏపీలో పోటీ చేస్తే త‌ప్పేంటి ? ఆ రోజు ఉద్య‌మ కాలంలో ఉన్న వాతావ‌ర‌ణం వేరు, ఇప్పుడున్న వాతావర‌ణం వేరు అని దీర్ఘాలు తీస్తూ, రాగాలు తీస్తూ.. టీఆర్ఎస్ నాయ‌కులు కొత్త భాష్యం చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

త‌మ నాయ‌కుడికి ఓ నాలుగు జిల్లాలో మంచి ప‌ట్టు ఉంది అని కూడా వారంతా అంటున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశంలోనూ, అదేవిధంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ, అదేవిధంగా ఉత్త‌రాంధ్ర‌లోనూ ఆయ‌న‌కు మంచి అభిమానులు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయ‌న అమ‌రావ‌తికి వ‌చ్చిన ఓ సంద‌ర్భంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించిన తీరు గురించి కూడా ప్ర‌స్తావిస్తున్నారు.

ఎలా అయినా ఆయ‌న ఉత్త‌రాంధ్ర నుంచి ఉత్త‌రాది వ‌ర‌కూ త‌న పార్టీని విస్త‌రింప‌జేయాల‌న్న ఆలోచ‌న‌తోనే ఉన్నారు. వీలున్నంత వ‌ర‌కూ ఆంధ్రా స‌ర్కారుతో క‌య్యాలు త‌గ్గించుకోవాల‌నే చూస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఆంధ్రావాసుల‌ను (సెటిల‌ర్ల‌ను) క‌డుపున పెట్టి దాచుకుంటాం అని ఆ రోజు సెటిల‌ర్ల అభిమానం ఏ విధంగా చూర‌గొన్నారో అదే విధానం ను ఇప్పుడు కూడా పాటించేందుకు సిద్ధం అవుతున్నారు.

వీలున్నంత త్వ‌ర‌గా పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నెల 18 లేదా 19 తారీఖుల్లో ఏదో రోజు ఏదో ఓ క్ష‌ణం కేసీఆర్ త‌న పార్టీని అనౌన్స్ చేయ‌నున్నారు. ఒక వేళ విస్తృత స్థాయి స‌మావేశం అయ్యాక ఆయ‌న ఢిల్లీ వెళ్లి అక్క‌డి వారితో మాటామంతీ పూర్తి చేసుకుని వ‌స్తే ఈనెల 19 సాయంత్ర‌మే జాతీయ పార్టీకి సంబంధించి స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక జాతీయ పార్టీ హోదాను పొందాలంటే ఎన్నిక‌ల్లో పోటీ చేశాక పోల్ అయిన ఓట్లలో క‌నీస స్థాయిలో ఓట్లు ఒక పార్టీకి రావాలి. అదేవిధంగా కేసీఆర్ పార్టీ వీలున్నంత వ‌ర‌కూ వేర్వేరు ప్రాంతాల‌లో ఆశించిన ఓట్లు, అదేవిధంగా ఆశించిన సీట్లు తెచ్చుకుని తీరాలి.

కానీ ఇవేవీ కాకుండా జాతీయ పార్టీ అని చెప్పేందుకు వీల్లేదు. జాతీయ పార్టీ అంటే కనీసం ఓ నాలుగు రాష్ట్రాల‌లో అయినా స‌త్తా చాటాలి. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌లు ఎలా ఉన్నా జాతీయ పార్టీ గా రూపాంత‌రం చెందాక కేసీఆర్ అనుకున్నంత వేగంగా పార్టీని విస్తృతం చేయ‌క‌పోతే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌రువు పోవ‌డం ఖాయం.. అని విప‌క్షాలు అంటున్నాయి. సెటైర్లు వేస్తున్నాయి. కేసీఆర్ ప్ర‌యత్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో అన్న‌ది విశ్లేషించుకుంటున్నాయి.