Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గెలుపును డిసైడ్ చేసిన 'న‌వ‌ర‌త్నాలు'!

By:  Tupaki Desk   |   24 May 2019 4:59 AM GMT
జ‌గ‌న్ గెలుపును డిసైడ్ చేసిన న‌వ‌ర‌త్నాలు!
X
ఏపీ రాజ‌కీయాల్ని ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించినోళ్ల‌కు జ‌గ‌న్ గెలుపు ఎలాంటి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌లేదు. కాకుంటే.. 120 సీట్ల‌కు మించి రావ‌నే అంచ‌నాకు భిన్నంగా ఏకంగా 151 సీట్ల‌లో గెలుపు మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేద‌నే చెప్పాలి. ఇంత‌టి భారీ విజ‌యం జ‌గ‌న్ కు ఎలా సాధ్య‌మైంది? జ‌గ‌న్ గెలుపులో కీల‌క‌మైన అంశాలు ఏమిటి? జ‌గ‌న్ కు అంత సానుకూల‌త ఎందుకు వ‌చ్చింది? దీనికి దారి తీసిన కార‌ణాలేమిట‌న్న అంశాల్ని వెతికే ప్ర‌య‌త్నం చేస్తే.. జ‌గ‌న్ నోటి నుంచి అదే ప‌నిగా వ‌చ్చే న‌వ‌ర‌త్నాలు కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న చేతికి అధికారం ఇస్తే న‌వ‌ర‌త్నాల్ని అమ‌లు చేస్తామ‌ని.. దాంతో ఏపీ అభివృద్ధి ప‌క్కా అని స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్ కు ఏపీ ప్ర‌జ‌లు జై కొట్టార‌ని చెప్పాలి. తొమ్మిది అంశాలు జ‌గ‌న్ ఘ‌న విజ‌యంలో కీల‌క‌భూమిక పోషించాయ‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆ తొమ్మిది అంశాలేమంటే..

1. నో యూట‌ర్న్.. ఒక‌టే స్టాండ్‌..

కీల‌కఅంశాల విష‌యంలో మొద‌ట్నించి ఒక‌టే స్టాండ్‌. యూట‌ర్న్ లాంటివి లేకుండా ఉండ‌టం జ‌గ‌న్ కు లాభించే అంశం. ఏపీ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ మొద‌ట్నించి ఒక‌టే మాట మీద ఉన్నారు. హోదా విష‌యంలో మొద‌ట్నించి వినిపిస్తున్న స్టాండ్ కు ఆయ‌న ఎప్పుడూ డివియేట్ కాలేదు. ఇది జ‌గ‌న్ విజ‌యాన్ని ప్ర‌భావితం చేసిన అంశంగా చెప్పాలి.

2. అంద‌రికి న‌చ్చిన న‌వ‌ర‌త్నాలు

క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రికి అదే ప‌నిగా హామీలు ఇవ్వ‌టం కాకుండా.. ఏపీ అభివృద్ధికి తొమ్మిది అంశాల మీద దృష్టి పెడితే ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ మొద‌ట్నించి న‌మ్ముతున్నారు. తాను ప‌వ‌ర్లోకి వ‌స్తే అమ‌లు చేసే సంక్షేమ‌ప‌థ‌కాల‌కు మొద‌ట్నించి ఆయ‌న అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్నారు. తాజా ఘ‌న విజ‌యంలో ఆయ‌న త‌ర‌చూ చెప్పే న‌వ‌ర‌త్నాలు కీల‌క‌భూమిక పోషించాయి. ప్ర‌జా సంక్షేమానికి సంబంధించిన ఆ తొమ్మిది సంక్షేమ ప‌థ‌కాలు చూస్తే..

ఎ. వైఎస్సార్ రైతు భ‌రోసా

బి. ఆరోగ్య శ్రీ‌

సి. యువ‌త‌- ఉపాధి

డి. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్

ఈ. అమ్మ ఒడి

ఎఫ్. పింఛ‌న్ల పెంపు

జి. వైఎస్సార్ ఆస‌రా

హెచ్. వైఎస్సార్ గృహ‌నిర్మాణం

ఐ. బీసీ సంక్షేమం

3. పాద‌యాత్ర‌

13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3648 కిలోమీట‌ర్ల పాటు సాగిన సుదీర్ఘ పాద‌యాత్ర కూడా జ‌గ‌న్ గెలుపులో కీల‌క‌భూమిక పోషించింది. క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌లో మొద‌లైన పాద‌యాత్ర శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. స్థానికంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తో పాటు.. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని ప‌రిష్కార‌మిస్తామ‌న్న భ‌రోసాతో ఆయ‌న యాత్ర‌ను సాగించారు. అప్యాయంగా మాట్లాడ‌టం.. బాధ‌తో వ‌చ్చిన వారిని ఓదార్చ‌టం లాంటివి చేస్తున్న జ‌గ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

4. ప్ర‌చార ఆర్భాటం ఎక్కువ‌.. ప‌ని త‌క్కువ‌

విభ‌జ‌న నేప‌థ్యంలో ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌చారం కోసం చంద్ర‌బాబు స‌ర్కారు అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌తో పాటు.. ప్ర‌చార ఆర్భాటాలు మితిమీర‌టం కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చేలా చేసింది. జ‌న్మ‌భూమి క‌మిటీల‌పై వ్య‌తిరేక‌త‌తో పాటు.. టీడీపీ ఎమ్మెల్యేల తీరు కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచేలా చేసింది.

5. దెబ్బేసిన ప‌సుపు కుంక‌మ

పార్టీ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా భావించిన ప‌సుపు కుంక‌మ ప‌థ‌కం బాబును ఏ విధంగానూ ఆదుకున్న‌ది లేదు. ప్ర‌జ‌ల‌ను ఓట‌ర్లుగా మాత్ర‌మే చూడ‌టం.. ప్ర‌భుత్వ ప‌థ‌కం పేరుతో ఎన్నిక‌ల ముందు డ‌బ్బులిస్తే.. వాటిని తీసుకున్నందుకు ఓటు వేస్తార‌న్న త‌ప్పుడు ఆలోచ‌నకు ప్ర‌జ‌లు బ‌లంగానే బుద్ధి చెప్పారు. మీకు డ‌బ్బులిస్తా.. నాకు మీరు ఓటు వేయండ‌న్న తీరు మంచిది కాద‌న్న సందేశాన్ని త‌మ తీర్పుతో స్ప‌ష్టం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల్ని ర‌ద్దు చేస్తామ‌న్న బాబు అమ‌లు చేయ‌లేద‌న్న జ‌గ‌న్ మాట‌లు న‌మ్మేలా చేయ‌టంతో పాటు.. ఓటు వేయ‌కుండా చేసింది.

6. రైతుల‌కు ఇచ్చే పెట్టుబ‌డి సాయం

ప్ర‌తి ఏడాది మే లో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద రూ.12,500 చొప్పున వారి ఖాతాల్లో జ‌మ చేస్తామ‌న్న జ‌గ‌న్ మాట కూడా ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేసింది. ఉచితంగా బోర్లు.. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ‌.. ప్ర‌కృతి విప‌త్తుల నిధి ఏర్పాటు.. తొమ్మిది గంట‌ల ఉచిత విద్యుత్ త‌దిత‌ర ప‌థ‌కాలు కూడా కార‌ణం

7. గురి చూసి వ‌దిలిన ఆక‌ర్ష‌ణ బాణం

టైం చూసి కొట్ట‌టం ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి అవ‌స‌రం. ఆ విష‌యం త‌న‌కు బాగా తెలుసున్న విష‌యాన్ని జ‌గ‌న్ త‌న చేత‌ల‌తో నిరూపించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల‌య్యాక వైఎస్సార్ కాంగ్రెస్ వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. వివిధ జిల్లాల్లో సీనియ‌ర్లు.. సామాజిక వ‌ర్గాల వారీగా కీల‌క‌పాత్ర పోషించే మాజీల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌టంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజ‌యంలో ముఖ్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

8. క‌లిసొచ్చిన‌ పీకే వ్యూహం

పోల్ మేనేజ్ మెంట్ లో జ‌గ‌న్ పార్టీ వీక్ అన్న విష‌యం తెలిసిందే. ఈ లోపాన్ని స‌రిదిద్దేందుకు బిహార్ కు చెందిన పోల్ మేనేజ్ మెంట్ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ (పీకే) ను నియ‌మించుకోవ‌టం కూడా లాభించింద‌ని చెప్పాలి. అంగ‌.. అర్థ‌బ‌లంతో పాటు సామాజిక స‌మీక‌ర‌ణాల్ని దృష్టిలో పెట్టుకొని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇన్ ఛార్జ్ ల‌ను మార్చేయ‌టం కూడా జ‌గ‌న్ పార్టీకి లాభం క‌లిగేలా చేసింది.

9. ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌

జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇద్దామ‌న్న ప్ర‌చారం కూడా ఎన్నిక‌ల ఫ‌లితాలు మీద ప్ర‌భావితం చూపింది. అదే ప‌నిగా విమ‌ర్శించ‌టం.. టార్గెట్ చేయ‌టం ఆయ‌న‌పై సానుభూతిని పెంచేలా చేసింది. బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కూడా ఒక కార‌ణంగా చెప్పాలి.