Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుపై మరో కేసు వేసిన నవయుగ!

By:  Tupaki Desk   |   5 Sep 2019 10:24 AM GMT
ఏపీ సర్కారుపై మరో కేసు వేసిన నవయుగ!
X
టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా తానై న‌డిపించిన న‌వ‌యుగ కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంతో క‌య్యానికి కాలుదువ్వుతున్న దాఖాలాలు క‌నిపిస్తున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వంతో సామార‌స్య పూర్వ‌కంగా వెళ్ళ‌కుండా కోర్టులు కేసులు అంటూ హ‌డావిడి చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పోల‌వ‌రం కాంట్రాక్టుల ర‌ద్దు వ్య‌వ‌హారం కోర్టులో ఉండ‌గా - ఇప్పుడు బంద‌ర్ పోర్టు నిర్మాణంపై కూడా హైకోర్టు గ‌డ‌ప తొక్కింది న‌వ‌యుగ సంస్థ‌. పోల‌వరం ప‌నుల‌ను న‌వ‌యుగ సంస్థ చంద్ర‌బాబు హ‌యాంలో ద‌క్కించుకుంది. అయితే ప‌నులు త్వ‌రిత గ‌తిన జ‌ర‌గ‌డం లేద‌ని - టెండ‌ర్ల‌లో అవినీతి అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్‌ కు పూనుకుంది.

ఈ వ్య‌వ‌హారంపై న‌వ‌యుగ కోర్టు త‌లుపులు త‌ట్టింది.. ఇప్పుడు అదే సంస్థ బంద‌ర్ పోర్టు నిర్మాణ ప‌నుల‌ను ద‌క్కించుకుంది. తాజాగా బందరు పోర్టు నిర్మాణం నుంచి తమ సంస్థతో కాంట్రాక్టును రద్దు చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని హైకోర్టుకు విన్నవించింది. అయితే బందరు పోర్టు పరిస్థితి పూర్తిగా వేరు. కొన్ని సంవత్సరాలుగా.. స్థలాలను ప్రభుత్వం వద్ద నుంచి పుచ్చుకున్నప్పటికీ.. నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తూ వ‌చ్చిందే తప్ప.. పనులు ప్రారంభించడం లేదని ఆరోపణలున్నాయి.

న‌వ‌యుగ ప‌నులు చేయ‌కుండా కాల‌యాప‌న చేస్తుండ‌టంతో విసిగి వేసారిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం 25 శాతం ప‌నులు కాని కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేశారు. అస‌లు ప్రారంభం కాని కాంట్రాక్టుల‌ను కూడా ర‌ద్దు చేశారు. ఇప్పుడు బంద‌ర్ పోర్టు ప‌నులు ప్ర‌భుత్వ‌మే చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌క‌టించ‌డంతో న‌వ‌యుగ సంస్థ కోర్టును ఆశ్ర‌యించింది. ప్ర‌భుత్వం నుంచి మాకు స‌రైన స‌హాకారం ఇవ్వ‌లేద‌ని, ఇస్తాన‌న్న వ‌న‌రులు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ప‌నులు చేయ‌లేద‌ని - మా వివ‌ర‌ణ తీసుకోకుండా ఇలా ర‌ద్దు చేయ‌డం సరికాదంటూ కోర్టును ఆశ్ర‌యించింది. ఇలా న‌వ‌యుగ సంస్థ కోర్డు మెట్లెక్క‌డంతో బంద‌రు పోర్టు ప‌నులు మ‌ళ్లీ మొద‌ట‌కే వ‌చ్చాయి.