Begin typing your search above and press return to search.

400 కోట్లకు ఎగనామం పెట్టిన ‘నవయుగ’.?

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:41 AM GMT
400 కోట్లకు ఎగనామం పెట్టిన ‘నవయుగ’.?
X
చంద్రబాబు హయాంలో ‘పోలవరం’, కృష్ణపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న నవయుగ సంస్థ మరో వ్యవహారం తాజాగా బయటపడింది. నెల్లూరు జిల్లాలో కృష్ణంపట్నం పోర్టు వద్ద వేల ఎకరాల భూమిని తీసుకున్న ‘నవయుగ’ సంస్థ.. నిబంధనల ప్రకారం ఆ భూములున్న ముత్తుకురు పంచాయతీకి చెల్లించాల్సిన దాదాపు 400 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు తేలింది.. ఈ మేరకు ముత్తుకూరు పంచాయతీకి నవయుగ చెల్లించాల్సిన పన్నులు సుమారు 400 కోట్లు ఎగనామం పెట్టిందని ఆడిట్ ఆధికారులు ప్రకటించారు.

*రైతులకు ఎగనామం.. రియల్ ఎస్టేట్ తో కోట్లు..
ముత్తుకూరు రెవెన్యూ పరిధిలో పోర్టు కోసం 2,625 ఎకరాలను సేకరించారు. పోర్టు కడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు స్వచ్ఛందంగా తక్కువ ధరకే భూములు ఇచ్చారు. అయితే ‘నవయుగ సంస్థ’ రైతుల నుంచి తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

*11 ఏళ్లు రూపాయి పన్ను చెల్లించని ‘నవయుగ’
అయితే తక్కువ ధరకు ఇచ్చిన రైతుల భూములను రియల్ ఎస్టేట్ చేసుకొని కోట్లు సొమ్ము చేసుకున్న‘నవయుగ’ సంస్థ.. 11 సంవత్సరాలుగా ఆ రియల్ వెంచర్ ఉన్న ‘ముత్తుకూరు’ పంచాయతీకి పన్నులు కట్టలేదని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు లెక్కలు తీసి దాదాపు 400 కోట్ల పన్నులను ముత్తుకూరు పంచాయతీకి నవయుగ ఎగ్గొట్టిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

*నిబంధనలు ఇవీ..
ఏ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోనైనా భూములు, మార్కెట్ విలువ ప్రకారం స్థానిక పంచాయితీకి పన్నులు చెల్లించాలి. కానీ అప్పటి ప్రభుత్వాలు ఈ కృష్ణం పోర్టు సంస్థలకు నామమాత్రంగా పన్నులు వేశారు. కేవలం రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు వేశారు. ఆ ప్రకారం అయినా 6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణ పట్నం పోర్టు, భూములకు అర్ధరూపాయి చొప్పున పన్ను వేస్తే ఏకంగా రూ.33.05 కోట్లు నెట్ ట్యాక్స్ లెక్క తేలింది. దాన్ని కూడా సంస్థ చెల్లించలేదు. ఇక లైబ్రరీ, నీటి పన్ను, విద్యుత్ సెస్, డ్రైనేజీ సెస్ కింద ప్రభుత్వానికి ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాలి. కానీ ఇప్పటివరకూ 11 ఏళ్లు గడుస్తున్నా రూపాయి చెల్లించలేదు.

*నోటీసులు ఇచ్చినా స్పందన లేని నవయుగ
ఇప్పటికే ముత్తుకూరు పంచాయతీకి 11 ఏళ్లుగా ఎగ్గొట్టిన పన్ను 400 కోట్లు దాటిందని.. చెల్లించాలని నోటీసులు జారీ చేసినా ‘నవయుగ’ సంస్థ స్పందించలేదని అధికారులు తెలిపారు. కృష్ణం పట్నం యాజమాన్యానికి ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా పన్ను చెల్లించలేదని నెల్లూరు డీపీవో సుస్మిత తెలిపారు.

*గత ప్రభుత్వం అండదండలతోనేనా..?
నిజానికి కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి పన్ను మినహాయింపులు లేవు.కానీ గత ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలను పెట్టుకొనే పోర్టు యాజమాన్యం ఏకంగా రూ.400 కోట్ల పన్ను ఎగ్గొంటిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 400 కోట్లు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్థులు కోరుతున్నారు.