Begin typing your search above and press return to search.

వైసీపీ మాట‌!..బాల‌య్య గెలుపు గెలుపే కాదు!

By:  Tupaki Desk   |   16 Dec 2017 9:21 AM GMT
వైసీపీ మాట‌!..బాల‌య్య గెలుపు గెలుపే కాదు!
X
తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు వారసుడిగా సినిమాల్లో త‌న‌కంటే ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించిన నంద‌మూరి బాల‌కృష్ణ‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ వార‌సుడిగానే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ‌తంలో త‌న తండ్రికి నీరాజ‌నం ప‌లికిన అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోక‌వ‌ర్గం నుంచే పోటీకి దిగిన బాల‌య్య‌... బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ త‌ర్వాత హిందూపురం అభివృద్ధికి బాటలు ప‌రుస్తానంటూ బ‌య‌లుదేరిన ఆయ‌న‌... ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే ఎంత అభివృద్ధి ప‌నులు చేసినా... బాల‌య్య‌కు అక్క‌డ మిశ్ర‌మ ఫ‌లితాలే వ‌చ్చాయి. తాను నియ‌మించుకున్న సిబ్బంది చేతివాటం - దురుసుత‌నంతో బాల‌య్య ప్ర‌తిష్ఠ నిజంగానే గంగ‌లో క‌లిసిపోయింది. ప్ర‌జ‌ల‌ను వేధిస్తూ - పార్టీలో చిచ్చు పెట్టేందుకు కూడా ఏమాత్రం వెనుకాడ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించిన త‌న పీఏను త‌క్ష‌ణం తొల‌గించేందుకు కూడా బాల‌య్యకు చేత కాలేదన్న విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి.

అయినా ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకంటే... వైసీపీకి చెందిన ఓ యువ నేత బాల‌య్య‌ను ల‌క్ష్యంగా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేనా.... వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం టికెట్ త‌న‌కు ల‌భిస్తే... బాల‌య్య‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తాన‌ని కూడా బ‌స్తీ మే స‌వాల్ అన్న రీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. స‌ద‌రు నేత ఎవ‌రు అన్న విష‌యానికి వ‌స్తే... వైసీపీలో యువ నేత‌గానే కాకుండా... వ‌చ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగే నేత‌గా ప్ర‌చారంలో ఉన్న న‌వీన్ నిశ్చ‌ల్‌. పేరు కొత్త‌గానే ఉన్నా... వైసీపీలో ఇటీవ‌లి కాలంలో నిశ్చ‌ల్ కాస్తంత దూకుడు పెంచేశార‌ని చెప్పాలి. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన యాత్ర ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఓ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో బాల‌య్య‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురం అభ్య‌ర్థిగా పార్టీ త‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తే... బాల‌య్య‌ను ఓడించి తీర‌తాన‌ని ఆయ‌న శ‌ప‌థం చేశారు. అలా కాని ప‌క్షంలో... బాల‌య్య‌పై తాను ఓడిపోతే... అర‌గుండు గీయించుకుని న‌డి వీధుల్లో ఊరేగుతాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో హిందూపురంలో బాల‌య్య గెలిచిన వైనాన్ని కూడా ప్ర‌స్తావించిన నిశ్చ‌ల్... ఆ ఎన్నిక‌ల్లో బాల‌య్య గెలుపు గెలుపే కాద‌ని కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. న‌మ్మి ఓటేసిన ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌లేన‌ప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారని కూడా నిశ్చ‌ల్... బాల‌య్య‌కు కాస్తంత సూటి ప్ర‌శ్నే సంధించారు. ఈ ప్ర‌శ్న‌తో బాల‌య్య అస‌లు హిందూపురం ప్ర‌జ‌లను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిశ్చ‌ల్ కాస్తంత ఘాటు విమ‌ర్శ‌లే చేశారు. మ‌రి నిశ్చ‌ల్ ప్ర‌క‌ట‌న‌పై అటు బాల‌య్య గానీ - టీడీపీ నేత‌లు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.