Begin typing your search above and press return to search.

బాలయ్యపై బరిలోకి దిగేదెవరు?

By:  Tupaki Desk   |   12 March 2019 10:57 AM GMT
బాలయ్యపై బరిలోకి దిగేదెవరు?
X
టీడీపీ కంచుకోటగా మారిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సినీనటుడు నందమూరి బాలకృష్ణ 2019లోనూ బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన బుక్కపట్నం నవీన్ కుమార్ అలియాస్ నవీన్ నిశ్చల్ ను సమన్వయకర్త పదవి నుంచి తప్పించిన వైఎస్సార్సీపీ అధిష్టానం కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీని తెరపైకి తెచ్చింది. అయితే గత పది రోజుల నుంచి అబ్దుల్ ఘనీ మౌనంగా ఉండటంతో మరో అభ్యర్థి కోసం వేట మొదలెట్టింది. ఈక్రమంలో రాయలసీమ ఐజీగా పని చేసిన ఇక్బాల్ మహ్మద్ పేరు పరిశీలనలో ఉంది. ఇక్బాల్ అహ్మద్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. కాగా స్థానికంగా జనాదరణ పొందిన నవీన్ నిశ్చల్ కు టికెట్ ఇస్తే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

హిందూపురంలో 1984 నుంచి టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 1985 - 1989 - 1994లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999లో సీసీ వెంకటరాముడు - 2004లో రంగనాయకులు - 2009లో అబ్దుల్ఘనీ - 2014లో నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. ఆది నుంచి కూడా కాంగ్రెస్ ప్రాబల్యం అంతంత మాత్రమే అని చెప్పాలి. అయితే నవీన్ నిశ్చల్ రాజకీయాల్లోకి వచ్చాక కంచుకోటగా ఉన్న హిందూపురంలో కలకలం రేపారు.

తొలిసారిగా కాంగ్రెస్ తరఫున 2004లో హిందూపురం నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ఓటమి పాలయ్యారు. అయితే అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల దృష్యా 2009లో ఆయనకు టికెట్ రాలేదు. కాంగ్రెస్ నుంచి అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేశారు. టీడీపీ నుంచి అబ్దుల్ ఘనీ రంగంలోకి దిగారు. ఈక్రమంలో నవీన్ నిశ్చల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తనదైన ముద్ర వేసుకున్నారు. యథావిధిగా మళ్లీ టీడీపీ గెలిచింది. అయితే నవీన్ నిశ్చల్ రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మూడోస్థానంలో సరిపెట్టుకున్నారు. కాగా నవీన్ నిశ్చల్ కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలై అందరి దృష్టినీ ఆకర్షించారు.

2014లో వైఎస్సార్సీపీ తరఫున నవీన్ నిశ్చల్ పోటీ చేయగా.. టీడీపీ నుంచి ఎన్టీఆర్ వారసుడు - సినీనటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగప్రవేశం చేశారు. సుమారు 14 వేల మెజారిటీతో గెలిచారు. అయితే అనంతరం ఆయన సినిమా రంగంలో బిజీగా ఉండటంతో పాలన గాలికి వదిలేశారనే విమర్శలు వచ్చాయి. పీఏగా వ్యవహరిస్తున్న శేఖర్ ఎన్నో అక్రమాలు చేశారనే ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించారు. ఫలితంగా నిత్యం ప్రజల సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్న నవీన్ నిశ్చల్ నాలుగేళ్లుగా పోరాటం చేశారు. కానీ అధిష్టానం ఉన్నఫలంగా ఆయనకు టికెట్ నిరాకరించడం చర్చనీయంగా మారింది. టీడీపీ నుంచి వచ్చిన అబ్దుల్ ఘనీని సమన్వయకర్తగా ప్రకటించింది. అయితే నవీన్నిశ్చల్ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ఘనీ తాను పోటీ చేయడం లేదని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఫలితంగా నవీన్ నిశ్చల్ కు మరోసారి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.