Begin typing your search above and press return to search.

మళ్లీ శాసించిన ఒడిశా పెదరాయుడు

By:  Tupaki Desk   |   23 Dec 2017 7:10 AM GMT
మళ్లీ శాసించిన ఒడిశా పెదరాయుడు
X
తప్పు చేస్తే తనవారైనా - పరాయివారైనా నిర్దాక్షిణ్యంగా వేటేసే ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ తన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రిని తొలగించారు. తనకు ఎదురుతిరిగిన వారిపై వేటేయడమే కాదు.. అక్రమాలు - అవినీతి - ప్రజావ్యతిరేక పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగించడం నవీన్ కు ముందు నుంచి అలవాటే. తాజాగా ఆయన వ్యవసాయ శాఖ బాధ్యతలు చూస్తున్న సీనియర్ మంత్రి దామోదర్ రౌత్‌ ను తొలగించారు. ఇంతకీ ఆయన ఏం చేశారు... ఎందుకు తొలగించారన్నది తెలిస్తే.... అలాంటి కారణాలకు తొలగించడం మొదలుపెడితే ఏపీ - తెలంగాణల్లో ఒక్క మంత్రి కూడా మిగలరని అంటారు ఎవరైనా.

సీనియర్ మంత్రి అయిన దామోదర్ రౌత్ నాలుగురోజుల కిందట మల్కనగిరిలో ఓ సభలో మాట్లాడుతూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదివాసీలు యాచన చేయరని.. కానీ, బ్రాహ్మణులు మాత్రం కష్టాలొస్తే యాచన చేసుకుని బతుకుతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల పూరీ వంటి ప్రాంతాల్లో బ్రాహ్మణులు నిరసనలు తెలిపారు. దీంతో సీఎం నవీన్ రౌత్‌ ను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఏ కులానికి - వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని... దాన్ని తాను సహించబోనని నవీన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయిన రౌత్ బిజూ జనతాదళ్‌ కు ఉపాధ్యక్షుడు కూడా.

కాగా 1977 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దామోదర్ రౌత్ నవీన్ తండ్రి బిజూ పట్నాయిక్‌ కు నమ్మిన బంటు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1979 నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు. నవీన్ పట్నాయిక్ ప్రతి మంత్రివర్గంలోనూ ఆయన ఉన్నారు. ఇప్పటివరకు ఆయన ఒఢిశాలో 15 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే... నవీన్ పట్నాయిక్ మంత్రివర్గంలో ప్రతిసారీ చోటు సంపాదిస్తున్నా కూడా ఆయన ఒక్కసారి కూడా అయిదేళ్ల పాటు మంత్రిగా ఉండలేకపోయారు. గతంలో వివిధ కారణాలు - అవసరాల వల్ల నవీన్ ఆయన్ను రాజీనామా చేయమని కోరడం - ఆయన తప్పుకోవడం జరిగింది. 2011లో ఆయన హరిజన అన్న పదం వాడి క్రిమినల్ కేసు ఎదుర్కొన్నప్పుడు కూడా నవీన్ ఆయన రాజీనామా కోరారు. వెంటనే రౌత్ రాజీనామా చేశారు. ఈసారి వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా నవీన్ రాజీనామా కోరకుండా వేటు వేశారు.

మరోవైపు రౌత్‌ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. రెండు నెలల కిందట అగన్వాడీ వర్కర్లు - ఒక బీజేపీ మహిళా నేతపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. బీజేపీ అప్పుడే ఆయన రాజీనామా చేయాలని డిమాండు చేయడంతో క్షమాపణ చెప్పారు. అలాగే.. గతంలో రైతుల ఆత్మహత్యల విషయంలోనూ ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం ఆయన బ్రాహ్మణులపై వ్యాఖ్యలు చేయడం మరింత వివాదాస్పదమైంది. ఒడిశాలో 9 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడం వల్ల కూడా వాళ్లను ఊరడించడానికి నవీన్ వెంటనే చర్యలు తీసుకున్నారన్న వాదనా ఉంది.