Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు షాక్‌...కూట‌మికి నో చెప్పిన ప్రాంతీయ పార్టీ

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:06 AM GMT
కాంగ్రెస్‌ కు షాక్‌...కూట‌మికి నో చెప్పిన ప్రాంతీయ పార్టీ
X
జనవరి 19న తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలో బీజేపీయేతర కూటమి నాయకుల ఎపిసోడ్ ద్వారా అధికార భార‌తీయ జ‌న‌తాపార్టీకి షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు, కాంగ్రెస్ సార‌థ్య‌లోని కూట‌మి నాయ‌కుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మహాకూటమిలో తమ పార్టీ ఉండబోదని బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు తాము దూరంగా ఉంటామని ఆయన తేల్చిచెప్పారు.

మంగళవారం కూడా ఈ అంశంపై స్పందించిన పట్నాయక్.. మహాకూటమిలో చేరడంపై తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఆ మరుసటి రోజే కూటమిలో ఉండబోవడం లేదని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. బీజేడీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించారు. వరికి కనీస మద్దతు ధరను పెంచాలని తాము ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పట్నాయక్ విమర్శించారు. దీంతో ఒడిశాలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న పార్టీని త‌మ గూటికి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన బీజేడీ ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి.

మొదటి నుంచి బీజేడీ తటస్థ వైఖరినే అవలంబిస్తున్నది. బీజేడీకి కంచుకోటగా మారిన ఒడిశాలో తన మార్క్ చూపించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 లోక్‌ సభ స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలో బీజేపీ గెలవగా.. మిగిలిన 20 స్థానాలనూ బీజేడీ గెలుచుకుంది. అయితే 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించడంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారించింది. అదే స‌మ‌యంలో బీజేడీ సైతం క్షేత్ర‌స్థాయిలో త‌న బ‌లం పెంచుకుంటోంది.