Begin typing your search above and press return to search.

జీవిత చరిత్ర తప్ప ఏమైనా రాస్తానంటున్న సీఎం

By:  Tupaki Desk   |   11 Jan 2016 7:24 AM GMT
జీవిత చరిత్ర తప్ప ఏమైనా రాస్తానంటున్న సీఎం
X
రాజకీయ నేతలు, ఇతర రంగాల ప్రముఖులు జీవిత కథలు రాసుకోవడమో.. రాయించుకోవడమో చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో గొప్పవారి జీవిత కథలు కోట్లాది మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. ఆ ప్రముఖులు కష్టాలను ఎదిరించి, అవకాశాలను అందిపుచ్చుకుని గెలిచిన క్రమం అంతా ఆ జీవితగాథల్లో చదివి తామూ స్పూర్తి పొందుతుంటారు ఎంతోమంది. అయితే... అన్ని జీవిత కథలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవిత కథలు.. ఇటీవల కాలంలో విమర్శలు - రాజకీయ రహస్యాలు వెల్లడించడం.. ప్రత్యర్థుల పరువు బజారున పడేయడానికి జీవిత కథలను వాడుకుంటున్నారు. అంతేకాదు... జీవితచరిత్ర రాసుకోవడం.. రాయించుకోవడాన్ని గొప్పగా ఫీలయ్యేవారూ ఎక్కువయ్యారు. అందుకే చాలామంది నాయకులు తాము ఏ గుండెపోటో, ప్రమాదం వల్లో చనిపోతామేమో అన్న భయంతో సగం జీవితంలోనే జీవిత కథలు రాసేస్తున్నారు కూడా.

ఇదంతా పక్కన పెడితే ఒడిశాలో వరుస విజయాలు సాధిస్తున్న అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్వతాహాగా రచయిత అయిన ఆయన చేసిన ఈ వ్యాఖ్య జీవిత చరిత్రలు రాసుకునే చాలామందికి చురక తగిలించినట్లయింది. ''ఏదైనా రాస్తాను కానీ జీవిత చరిత్ర మాత్రం రాసుకోను'' అని నవీన్ పట్నాయిక్ ప్రకటించారు. భువనేశ్వర్ లో జరిగిన లిటరరీ ఫెస్ట్ లో పాల్గొన్న ఆయన అక్కడ మాట్టాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. లిటరరీ ఫెస్టుకు వచ్చిన నవీన్ ను కలిసిన రచయితలు ఆయనతో... ''ఇంతవరకు మీకు ఓటమి అన్నది తెలియదు... అందుకే గెలవడం ఎలా అన్న పేరుతో మీ జీవిత చరిత్ర రాస్తే ఎందరికో ఉపయోగపడుతుంది'' అన్నారట. అందుకు నవీన్ స్పందిస్తూ... ''నా నిజ జీవిత గాథ అందరికీ ఆసక్తిగా ఉండకపోవచ్చు.. అందుకే అది నేను రాయను.. పని ఒత్తిడి వల్ల ఈమధ్య పెన్ను పెట్టలేకపోతున్నాను. ఏమైనా రాస్తే కాల్పనిక గాధలే రాస్తాను కానీ జీవిత చరిత్ర జోలికి మాత్రం వెళ్లను'' అని చెప్పారట.

కాగా నవీన్ స్వతాహాగా మంచి రచయిత. రాజకీయాల్లోకి రాకముందే ఆయన విభిన్న అంశాలపై పుస్తకాలు రాసి పేరు తెచ్చుకున్నారు. భారతీయ మూలికా వైద్యంపై ''ఏ గార్డెన్ ఆఫ్ లైఫ్'', రాజస్థాన్ లోని బికనీర్ పై ''డస్టర్ కింగ్ డమ్'' పేరుతో పుస్తకాలు రాశారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో 1590-1947 మధ్య కాలంపై ''ఎ సెకండ్ ప్యారడైజ్'' పేరుతో పుస్తకం రాశారు. అవన్నీ కూడా బాగా ఆదరణ పొందినవే కావడం విశేషం. నవీన్ సోదరి కూడా రచయితే. మొత్తానికి ఒక మోస్తరు నాయకులు కూడా జీవిత చరిత్రలు రాసుకుంటున్న తరుణంలో రెండు దశాబ్దాలుగా సీఎంగా ఉంటూ.... మేధావిగా, రాజకీయ వేత్తగా, ప్రకృతివైద్యంపై అవగాహన ఉన్నవాడిగా, రచయితగా ఎంతో జీవన వైవిధ్యం ఉన్న నవీన్ పట్నాయిక్ మాత్రం జీవిత చరిత్ర కు తాను ఆమడ దూరం అని చెప్పడం ఆసక్తికరమే.