Begin typing your search above and press return to search.

సిద్ధూని ఎంతవరకు నమ్మచ్చు ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 5:54 AM GMT
సిద్ధూని ఎంతవరకు నమ్మచ్చు ?
X
ఏమాత్రం నిలకడలేని వ్యక్తి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. ఇఫుడు సిద్ధూ గురించి ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్ గా తాను చేసిన రాజీనామాను వాపసు తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానంటు తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయిన తర్వాత సిద్ధూ రాజీనామా వాపసు ప్రకటనచేశారు.

అగ్రనేతలతో తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ సిద్ధూ ప్రకటన తర్వాత సిద్ధూ డిమాండ్లను అగ్రనేతలు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. ఆ డిమాండ్లు ఏమిటి ? అగ్రనేతలు అంగీకరించినవి ఏమిటి అనేవి మెల్లిగా బయటపడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అనుకున్నది సాధించుకోలేపోతే వెంటనే తనలోని అసంతృప్తవాది బయటకు వచ్చేస్తాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా బతకనీయడన్న విషయం అందికీ తెలిసిందే.

మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను పదవిలోనుండి సిద్ధూ ఎలా దింపేసింది, ఎలా అవమానకరంగా పార్టీలో నుండి సాగనంపింది అందరు చూసిందే. వచ్చే ఏడాదిలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఏకతాటిపై నడవాల్సిందిపోయి అంతః కలహాలతో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలకు ప్రధాన కారణం సిద్ధూయే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

సిద్ధూ ముందున్న ప్రధాన సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎక్కువమంది తన మద్దతుదారులకు ఎంఎల్ఏగా పోటీచేయించేందుకు టికెట్లు ఇప్పించుకోవటమే. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూయే తన మద్దతుదారుల టికెట్లకు ప్రయత్నించినపుడు మరి సీఎం చరణ్ జీత్ చన్నీ ఏమి చేయాలి. సీఎం కూడా తన మద్దతుదారులకు టికెట్లిప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు కదా ? ఇక్కడే ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యేందుకు అవకాశాలున్నాయి. మరపుడు అధిష్టానం ఏమి చేస్తుంది ?

ఇక్కడే సిద్ధూని ఏమాత్రం నమ్మేందుకు లేదు. సిద్ధూ వ్యవహారం చూస్తుంటే ముఖ్యమంత్రి సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ ప్లేసులో తననే సీఎంగా అధిష్టానం చేస్తుందని భావించి భంగపడ్డారు. అందుకనే తనలోని అసంతృప్తిని రాజీనామా ద్వారా బయటపెట్టారు. సరే ఇప్పటికేదో తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ రేపటి టికెట్ల పంపిణీలో మళ్ళీ అసంతృప్తి పైకి లేచే అవకాశాలు స్పష్టంగా ఉంది. ఎందుకంటే సిద్ధూ అనే వ్యక్తి ఒక అరాచకవాది. అరాచకాన్ని తట్టుకోవటం కష్టమే. అందుకనే సిద్ధూని ఏమాత్రం నమ్మేందుకు లేదు.