Begin typing your search above and press return to search.

పాతికేళ్ల నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు కన్ఫర్మ్ చేసిన సుప్రీం

By:  Tupaki Desk   |   19 May 2022 12:43 PM GMT
పాతికేళ్ల నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు కన్ఫర్మ్ చేసిన సుప్రీం
X
తప్పు చేసి తప్పించుకోవటం చాలా కష్టం. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నేత.. పంజాబ్ ముఖ్యమంత్రి కుర్చీలోకూర్చోవాలని తపించి.. భంగపడిన మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూకు తాజాగా ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. దాదాపు పాతికేళ్ల క్రితం చేసిన నేరానికి సంబంధించిన కేసులో ఎట్టకేలకు ఆయనకు ఏడాది జైలు విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే..ఇదే కేసుకు సంబంధించి గతంలో మరో కోర్టు రూ.వెయ్యి మాత్రమే ఫైన్ విధించింది. బాధిత కుటుంబం అప్పీలుకు వెళ్లటంతో.. ఆయన దోషిగా నిర్దారిస్తూ ఏడాది జైలు విధిస్తూ తీర్పును ప్రకటించారు. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
1988 డిసెంబరు 27న సిద్ధూ.. అతడి స్నేహితుడు రూపీందర్ సింగ్ లు కలిసి వాహనాల పార్కింగ్ ప్లేస్ కు వెళ్లారు.

అక్కడ వారికి గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో వివాదం చోటుచేసుకుంది. వారి మధ్య జరిగిన ఘర్షణ వేళ.. గుర్నమ్ ను కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేశారు సిద్ధూ.. అతని స్నేహితుడు. ఆ సందర్భంగా గుర్నమ్ మరణించాడు. పాటియాలాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తొలుత విచారించిన ట్రయల్ కోర్టు సిద్దూను నిర్దోషిగా తేలుస్తూ తీర్పును ప్రకటించారు.

అయితే.. బాధిత కుటుంబం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలుకు వెళ్లింది. ఈ క్రమంలో 2006లో పంజాబ్.. హర్యానా కోర్టు మాత్రం సిద్ధూను దోషిగా నిర్దారించింది. ఆ సందర్భంగా మూడేళ్లు జైలుశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయటమే కాదు.. ఆయనకు బెయిల్ కూడా ఇచ్చారు.

ఇదే కేసుకు సంబంధించి 2018లో సుప్రీంకోర్టు మరో బెంచ్.. ఘర్షణ వేళ పెద్ద వయస్కుడ్ని తీవ్రంగా గాయపరిచిన నేరానికి సిద్ధూకు.. అతని స్నేహితుడికి రూ.వెయ్యి చొప్పున ఫైన్ విధించారు. బాధితుడి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో బెంచ్ కు తరలించారు. తాజాగా మాత్రం సిద్ధూకు ఏడాది జైలు విధిస్తూ తీర్పును ఇచ్చారు. మరేం జరుగుతుందో చూడాలి.