Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై సిక్స‌ర్ల సిద్ధూ తీవ్ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   1 Dec 2018 5:43 AM GMT
కేసీఆర్‌ పై సిక్స‌ర్ల సిద్ధూ తీవ్ర వ్యాఖ్య‌లు
X
భార‌త మాజీ క్రికెట‌ర్ - పంజాబ్ కేబినెట్ మంత్రి న‌వ‌జోత్ సింగ్ సిద్ధూ తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. గులాబీ ద‌ళ‌ప‌తి కుటుంబాన్ని అలీబాబా - న‌లుగురు దొంగ‌లుగా అభివ‌ర్ణించారు. కేసీఆర్‌ను అలీబాబాగా - కేటీఆర్‌ - క‌విత‌ - హ‌రీశ్ రావు - సంతోష్ కుమార్‌ ల‌ను న‌లుగురు దొంగ‌లుగా పేర్కొన్నారు.

త‌న వాక్ చాతుర్యంతో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టంలో సిద్ధూ దిట్ట‌. శుక్ర‌వారం ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం తెలంగాణ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా సిద్ధూ విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ.. అలీ బాబా - 40 మంది దొంగ‌ల గురించి మ‌నం విన్నాం. తెలంగాణ‌లో మాత్రం అలీ బాబా - న‌లుగురు దొంగ‌లు ఉన్నారు. కేసీఆర్ అలీబాబా. మంత్రులు కేటీఆర్ - హ‌రీశ్ రావు - ఎంపీ క‌విత - రాజ్య‌స‌భ ఎంపీ సంతోష్ కుమార్ ఆయ‌న చుట్టూ ఉన్న న‌లుగురు దొంగ‌లు అని ఆరోపించారు.

ధ‌నిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్ పాల‌న‌లో అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌ని సిద్ధూ అన్నారు. గ‌తంలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉండేద‌ని.. ఇప్పుడు రూ.2.20 ల‌క్ష‌ల కోట్ల రుణ‌భారం ఉంద‌ని తెలిపారు. కేసీఆర్ కుటుంబం నిధులు స్వాహా చేయ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం లేద‌ని.. పూర్తిగా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం న‌డుస్తోంద‌ని పేర్కొన్నారు. ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌న్న హామీపై ప్ర‌శ్నించిన యువ‌కుణ్ని కేసీఆర్ ఓ స‌భ‌లో దూషించ‌డాన్ని సిద్ధూ త‌ప్పుప‌ట్టారు. హామీపై నిల‌దీయ‌డ‌మే ఆ యువ‌కుడు చేసిన నేర‌మా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గూండాయిజానికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ చేతిలో కీలుబొమ్మ‌గా మారార‌ని సిద్ధూ ఆరోపించారు. మోదీ హ‌స్తం లేకుంటే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేవే కావ‌ని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా ఓ ముఖ్య‌మంత్రి(కేసీఆర్‌) ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించార‌ని దుయ్య‌బ‌ట్టారు. లోక్‌ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత కొడుకు కేటీఆర్‌ - కుమార్తె క‌విత‌ల‌కు పెద్ద ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే దిశ‌గా కేసీఆర్ పావులు క‌దుపుతున్నార‌ని సిద్ధూ అన్నారు.