Begin typing your search above and press return to search.

పెద్ద‌న్న జోక్యంతో తృటిలో త‌ప్పిన యుద్ధం!

By:  Tupaki Desk   |   18 March 2019 7:29 AM GMT
పెద్ద‌న్న జోక్యంతో తృటిలో త‌ప్పిన యుద్ధం!
X
పుల్వ‌మా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు సంబంధించిన కొత్త విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార‌త్‌.. పాక్ ల మ‌ధ్య యుద్ధం దాదాపుగా మొద‌ల‌య్యే ప‌రిస్థితుల నుంచి మామూలు ప‌రిస్థితుల‌కు వ‌చ్చిన వైనం వెలుగు చూసింది. పుల్వామా ఉగ్ర‌దాడి.. అనంత‌రం భార‌త వైమానిక ద‌ళం జ‌రిపిన మెరుపుదాడుల‌కు.. దానికి ప్ర‌తిగా పాక్ కు చెందిన యుద్ధ విమానాలు నాలుగు భార‌త్ గ‌గ‌న‌త‌లంలోకి చొచ్చుకురావ‌టం.. వాటిని త‌రిమేందుకు వెళ్లిన ఎయిర్ ఫోర్స్ వింగ్ క‌మాండర్ ఫ్లైట్ కూలిపోవ‌టం.. ఆయ‌న పాక్ ద‌ళాల‌కు చిక్క‌టం తెలిసిందే.

ఆ త‌ర్వాత ఆయ‌న్ను విడుద‌ల చేస్తూ పాక్ తీసుకున్న నిర్ణ‌యంతో ఇరుదేశాల మ‌ధ్య క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు తొలిగాయి. చూసేందుకు పైకి ఈ విష‌యాలే క‌నిపించినా.. లోలోన చాలానే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పీక్స్ కు చేర‌టంతో భార‌త నావికాద‌ళం యుద్ధానికి స‌న్న‌ద్ద‌మైన విష‌యాన్ని వెల్ల‌డించింది. విమాన వాహ‌క నౌక ఐఎన్ ఎస్ విక్ర‌మాదిత్య స‌హా అణు జ‌లాంత‌ర్గాములు.. యుద్ధ విమానాల‌ను మోహ‌రించిన‌ట్లుగా తాజాగా వెల్ల‌డైంది.

భార‌త నావికాద‌ళం స‌న్న‌ద్ధం కావ‌టంతో పాక్ యుద్ధ నౌక‌లు మ‌క్రాన్ కోస్ట్ దాటి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సాహ‌సించ‌లేద‌ని నావికాద‌ళం పేర్కొంది. ఆ టైంలో 60 యుద్ధ నౌక‌లు.. కోస్టు గార్డుకు చెందిన 12 నౌక‌లు.. 60 యుద్ధ విమానాల‌తో నావికాద‌ళ విన్యాసాలు జ‌రుగుతుండ‌టంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌రోవైపు పాక్ పైకి ఆరు క్షిప‌ణుల్ని ప్ర‌యోగించేందుకు భార‌త్ సిద్ధంకావ‌టం.. దానికి త‌గ్గ‌ట్లే పాక్ కూడా క్షిప‌ణుల్ని భార‌త్ వైపుఎక్కు పెట్టిన‌ట్లుగా గుర్తించారు. ఈ రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రిగేందుకు త‌యారైన నేప‌థ్యంలో ఎంట్రీ ఇచ్చిన అమెరికా.. ఇరుదేశాల్ని బుజ్జ‌గించ‌టంతోపాటు.. యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నించింది. ఒక‌విధంగా చూస్తే.. పెద్ద‌న్న జోక్య‌మే ఇరుదేశాల మ‌ధ్య యుద్ధం త‌ప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.