Begin typing your search above and press return to search.

అసలు కన్నా కొసరే ఎక్కువైపోయిందా ?

By:  Tupaki Desk   |   11 Nov 2021 6:30 AM GMT
అసలు కన్నా కొసరే ఎక్కువైపోయిందా ?
X
అసలు కన్నా కొసరే ముద్దనే సామెత తెలుగులో చాలా పాపులర్. ముంబై క్రూయిజ్ షిప్పులో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన షారక్ ఖాన్ కొడుకు ఆర్యాన్ ఖాన్ కేసు విషయం కన్నా అనవసరమైన విషయాలు, కేసుతో ఎలాంటి సంబంధం లేని విషయాలే ఎక్కువ సంచలనమవుతున్నాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక అనవసరంగా వేలుపెట్టి రోజుకో ఆరోపణ చేస్తుండటంతో మొత్తం కేసంతా ఇఫుడు కంపుగా తయారైపోయింది.

కేసు దర్యాప్తు అధికారి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబయి జోన్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మంత్రి నవాబ్ రోజుకో ఆరోపణ చేశారు. ఒకసారి ఆర్యన్ ఖాన్ను తప్పించేందుకు రు. 25 కోట్లు అడిగింది నిజమే అని ఒకసారి చెప్పారు. తర్వాత వాంఖడే హిందువు కాదని ముస్లిం అని మరోసారి చెప్పారు. ఆ తర్వాత ఆర్యన్ను మాదక ద్రవ్యాల కేసులో ఇరికించారన్నారు. ఇపుడేమో ఆర్యన్ ది మాదక ద్రవ్యాల కేసు కాదని కిడ్నాపని గోల గోల చేస్తున్నారు.

నవాబ్ చేసే ప్రతి ఆరోపణలోను వాంఖడేతో పాటు బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవీస్ ను కూడా లాగారు. దాంతో ఫడ్నవీస్ స్పందిస్తు నవాబ్ కు మాఫియాతో లింకులున్నాయంటు రివర్సు ఎటాక్ మొదలుపెట్టారు. దాంతో మాఫియా కనెక్షన్లు పిక్చర్లోకి ఎంటరై వ్యవహారమంతా మాదక ద్రవ్యాల కేసు నుండి పక్కకు తప్పిపోయి మాఫియా అని, వాంఖడే ముస్లిమని, ఆర్యన్ ది కిడ్నాపనే విషయాలు సంచలనంగా మారిపోయాయి.

నిజానికి ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల కేసుకు నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి కూడా ఎలాంటి సంబంధంలేదు. కిడ్నాపా లేకపోతే రు. 25 కోట్లు అడిగింది నిజమా ? కాదా ? అన్న విషయాన్ని తేల్చాల్సిన షారుక్ అసలు నోరే విప్పలేదు ఇంతవరకు. భవిష్యత్తులో కూడా షారుక్ మాట్లాడుతారనే నమ్మకం కూడా లేదు. ఏదేమైనా నవాడ్ ఆరోపణల దెబ్బకు వాంఖడేను కేసు దర్యాప్తు నుండి పక్కకు తప్పించేశారు.

బహుశా నవాబ్ కు కావాల్సింది కూడా ఇదేనేమో. నిజానికి కేసుకు రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు. ఎందుకంటే మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో పనిచేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఈ కేసుకు రాష్ట్ర పోలీసులకు ఏమాత్రం సంబంధంలేదు. అయినా తగుదునమ్మా అంటు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అనవసరంగా వేలు పెట్టి బాగా కెలికేసి గబ్బు పట్టించేశారు. ఇక్కడ అసలు కన్నా కొసరే ఎక్కువైపోయిందనే సామెత నిజమైనట్లు అనిపిస్తోంది.