Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌ధాని..ఆయ‌న కుమార్తె అరెస్ట్‌ కు సిద్ధం!

By:  Tupaki Desk   |   13 July 2018 4:28 AM GMT
మాజీ ప్ర‌ధాని..ఆయ‌న కుమార్తె అరెస్ట్‌ కు సిద్ధం!
X
పొరుగున ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు రాజ‌కీయ ర‌గ‌డ మ‌రింత ముదిరింది. ఒక కేసు విష‌యంలో కోర్టు శిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్ర‌ధానికి.. ఆయ‌న కుమార్తెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంత‌కీ ఆ మాజీ ప్ర‌ధాని ఎవ‌రు? అరెస్ట్ ముప్పు ఎదుర్కొంటున్న మాజీ ప్ర‌ధాని కుమార్తె ఎవ‌ర‌న్న విష‌యంలోకి వెళితే..

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉంటున్న ఆయ‌న ఎప్పుడైతే పాక్ లో అడుగు పెడ‌తారో.. ఆ వెంట‌నే అరెస్ట్ చేయ‌టానికి రంగం సిద్ధం చేశారు. ఎవ‌న్ ఫీల్డ్ అపార్ట్ మెంట్ కేసులో ప‌దేళ్ల జైలుశిక్ష‌ పడినందున న‌వాజ్ ఆయ‌న కుమార్తెల‌ను అరెస్ట్ చేయ‌టానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు.. వారి అరెస్ట్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా అల్ల‌ర్లు రేగిన ప‌క్షంలో.. వాటిని కంట్రోల్ చేసేందుకు భారీగా పోలీసుల్ని మొహ‌రించారు.

ఈ కేసులో న‌వాజ్ ప‌దేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటుంటే.. ఆయ‌న కుమార్తె మ‌ర్య‌మ్ ఏడేళ్ల జైలును ఎదుర్కొంటున్నారు. లండ‌న్ నుంచి లాహోర్ ఎయిపోర్ట్‌ కు చేరుకున్నంత‌నే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంప‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఏవైనా గొడ‌వ‌లు చెల‌రేగే ప్ర‌మాదం ఉంద‌న్న ఉద్దేశంతో న‌వాజ్ పార్టీకి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన 300 నేత‌ల్ని అదుపులోకి తీసుకున్నారు.

న‌వాజ్‌.. ఆయ‌న కుమార్తెలను అరెస్ట్ చేయాల‌ని నేష‌న‌ల్ అకౌంట‌బిలిటీ బ్యూరో చైర్మ‌న్ జావేద్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. అరెస్ట్ అనంత‌రం వీరిద్ద‌రిని రావ‌ల్పిండిలోని అదియాలా జైలుకు త‌ర‌లించాల‌ని భావిస్తున్నారు. అరెస్ట్ నేప‌థ్యంలో ఎక్క‌డా ఎలాంటి అల్ల‌ర్లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు భారీ ఎత్తున భ‌ద్ర‌తా సిబ్బందిని రంగంలోకి దించారు. అల్ల‌ర్లు చేసేందుకు అవ‌కాశం ఉన్న నేత‌ల్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అరెస్ట్ చేశారు. మొత్తంగా న‌వాజ్.. ఆయ‌న కుమార్తెల అరెస్ట్ రంగం సిద్ధ‌మైన‌ట్లే.