Begin typing your search above and press return to search.

పండగపూట పాడు బుద్ది చూపిన నవాజ్

By:  Tupaki Desk   |   13 Sep 2016 9:42 AM GMT
పండగపూట పాడు బుద్ది చూపిన నవాజ్
X
ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో రకంగా భారత్ విషయంలో తలదూర్చే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా మరోసారి తన పాడు బుద్ధిని ప్రదర్శించారు. కశ్మీర్ అంశాన్ని కెలికి.. అక్కడి వారిని తరచూ ఆవేశానికి గురి చేసే నవాజ్ షరీఫ్ తాజాగా బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాడు మాటలు మాట్లాడారు. కశ్మీరీ ఆందోళనల్ని తాజాగా ప్రస్తావించిన ఆయన.. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

భారత్ నుంచి విడిపోయేందుకు కశ్మీరీలు చేస్తున్న త్యాగాలను ఈ బక్రీద్ పండుగను అంకితం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. బక్రీద పర్వదినాన్ని పురస్కరించుకొని తన నివాసమైన రాయ్ విండ్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి షరీఫ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ ప్రజల త్యాగాల్ని తాము మర్చిపోలేమని.. వారి త్యాగాలకు బక్రీద్ పండుగను అంకితం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.

‘‘వారు కచ్ఛితంగా విజయం సాధిస్తారు. కశ్మీర్ ప్రజల ఆశలు నెరవేరే వరకూ మేం వారికి మద్దతు ఇస్తూనే ఉంటాం. భారత్ నుంచి స్వేచ్ఛ పొందేందుకు కశ్మీర్ ప్రజలు వారి మూడో తరాన్ని త్యాగం చేశారు’’ అంటూ భారత్ కు మంట పుట్టే వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలల క్రితం ఉగ్రవాది.. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత బలగాలు ఎన్ కౌంటర్ చేయటం.. అనంతరం కశ్మీర్ లో కలకలం రేగటం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా కశ్మీర్ లోయ అట్టుడుగుతున్న వేళ.. మరోసారి కశ్మీరీలను రెచ్చగొట్టేలా పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేశారు. పండగ పూట కూడా పాపపు మాటల్నే షరీఫ్ నోట రావటం గమనార్హం.