Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రధానికి కాలిపోయేలా చేసిన ‘డాన్’

By:  Tupaki Desk   |   11 Oct 2016 5:44 AM GMT
ఆ దేశ ప్రధానికి కాలిపోయేలా చేసిన ‘డాన్’
X
సర్జికల్ దాడుల నేపథ్యంలో.. భారత్.. పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్నఅంశాలు ఎంత సున్నితమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్వేచ్ఛగా.. స్వతంత్రంగా కథనాలు అందిస్తే పాకిస్థాన్ లో మీడియాకు ఎన్ని చిక్కులన్న విషయం తాజాగా బయటకు వచ్చిందని చెప్పాలి. పాకిస్థాన్ లో ప్రముఖ మీడియా సంస్థ అయిన డాన్ ప్రచురించిన ఒక కథనం సంచలనం సృష్టించటమే కాదు.. దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మంట పుట్టేలా చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వండి వార్చేసిన కథనాన్ని అచ్చేసిందంటూ డాన్ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఆ పత్రికపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

నవాజ్ కు అంత మంటపుట్టించేలా రాసిన వార్త ఏమిటంటే.. దేశ ప్రధాని నవాజ్ ష‌రీఫ్ కు.. ఆర్మీ చీఫ్ కు చెడిందంటూ ప్రముఖంగా ప్రచురించిన కథనంపై నవాజ్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాదు.. అంతర్జాతీయంగా పాక్ ఒంటరి అయిందంటూ ప్రభుత్వం మిలటరీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా కూడాప్రచురించింది. ఈ వార్త పాక్ తో సహా పలు దేశాల్లో పెద్ద సంచలనంగా మారింది.

ఈ కథనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రధాని.. డాన్ పై చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఇటీవల ప్రధాని నవాజ్ షరీఫ్... ఆర్మీ చీఫ్ రహీల్ ష‌రీఫ్ - ఆర్థికమంత్రి ఇషాక్ దార్ - అంతర్గత మంత్రి నిసార్ అలీఖాన్ - పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ - ఐఎస్ ఐ డీజీ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్లతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ‘డాన్’ పత్రికలో ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సదరు పత్రిక అచ్చేసిన కథనంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రధాని.. కథనంలో ఉన్న సమాచారమంతా వండి వార్చిందేనని తేల్చారు. సదరు మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాక్ష్యాత్తు దేశ ప్రధానికి మంట పుట్టించిన ‘డాన్’ భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగామారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/