Begin typing your search above and press return to search.

కాశ్శీర్ పై మాట్లాడారు.. మరేం చేస్తారో..?

By:  Tupaki Desk   |   1 Oct 2015 4:26 AM GMT
కాశ్శీర్ పై మాట్లాడారు.. మరేం చేస్తారో..?
X
అంతర్జాతీయ వేదిక మీద కాశ్శీర్ అంశాన్ని ప్రస్తావించమనండి చూద్దాం.. అప్పుడేం జరుగుతుందో చూస్తారంటూ కేంద్ర సర్కారులోని మంత్రులు పలువురు నోటికి పని చెప్పారు. అయితే.. పలువురి అనుమానాల్ని నిజం చేస్తూ.. కాశ్శీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తావించటమే కాదు.. కాశ్శీర్ లో శాంతి స్థాపనకు ఏమేం చేయాలో కూడా చెప్పుకొచ్చారు.

కశ్శీర్ ను సైన్య రహితం చేయటం.. సియాచిన్ నుంచి బేషరతుగా సైనిక దళాలను ఉపసంహరించుకోవటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరు దేశాల దళాల్ని ఉపయోగించటం కానీ.. ఉపయోగిస్తామని బెదిరించటం కానీ చేయకపోవటం.. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రాతిపదిక తీసుకోవటం లాంటివి అమలు చేస్తే భారత్.. పాక్ ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొంటాయని నొక్కి చెప్పారు.

షరీఫ్ చెప్పినట్లు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యం సైన్యం పహరా ఉంటేనే వందలాది మంది తీవ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి వచ్చేస్తున్నారు. షరీఫ్ చెప్పినట్లు చేయాలే కానీ.. భారత్ లోకి వేలాది మంది ఉగ్రవాదులు రోజుల్లో చేరిపోవటమే కాదు.. పాకిస్థాన్ సైన్యం ఢిల్లీ గడ్డ మీద కాలు మోపినా ఆశ్చర్యం లేదు.

చెప్పేందుకు కాస్త అయినా బుద్ధి ఉన్న విధంగా మాట్లాడాల్సిన పాక్ ప్రధాని తన అత్యాశను మరోసారి అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించారు. పాక్ ప్రధాని మాటలు చూస్తుంటే.. మేం ఏం చేసినా మీరుచూస్తూ ఉండండి.. అప్పుడే మీతో మాకు శాంతి అన్నట్లుగా ఉంది. పాక్ ప్రధాని చెప్పినట్లుగా చేయాలే కానీ.. ఇక శాశ్వితంగా భారత్ లో శాంతి అన్నది లేకుండా చేయటమే కాదు.. మరో ఇరాక్.. సిరియా మాదిరి చేస్తారనటంలో సందేహం లేదు.

అంతర్జాతీయ వేదికల మీద కాశ్శీర్ విషయాన్ని ప్రస్తావిస్తే ఏదో చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడేం చేస్తుందో చూడాలి. కాశ్శీర్ విషయాన్ని మాట్లాడటమే కాదు.. స్థాయికి మించిన అంశాల్ని ప్రస్తావించిన పాక్ కు భారత సర్కారు ఏ విధంగా బుద్ధి చెబుతుందో చూడాలి. అంతర్జాతీయ వేదికలపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న పాక్ నోటికి అర్జెంట్ గా తాళాలు వేయటమే కాదు.. తొందరపడి మాట్లాడితే.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం మోడీ సర్కారు మీద ఉంది. మరి.. ఆ పని మోడీ సర్కారు చేస్తుందా?