Begin typing your search above and press return to search.

పాక్ ప్ర‌ధానికి ప‌ద‌వి పోతే భార‌త్‌ కు డేంజ‌ర్‌!

By:  Tupaki Desk   |   13 July 2017 6:48 AM GMT
పాక్ ప్ర‌ధానికి ప‌ద‌వి పోతే భార‌త్‌ కు డేంజ‌ర్‌!
X
పొరుగున ఉండే పాకిస్థాన్ ప్ర‌ధాని ప‌ద‌వి పోతే మ‌న‌కు న‌ష్ట‌మా? అంటే.. అవున‌నే చెబుతున్నారు నిపుణులు. కాసుల క‌క్కుర్తితో త‌ప్పు చేసిన కుమార్తె మ‌ర్య‌మ్ ష‌రీఫ్ దెబ్బ‌కు పాక్ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న న‌వాజ్ షరీఫ్ కు ప‌ద‌వీ గండం ముంచుకొచ్చిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

త‌న ఆస్తుల వెల్ల‌డి సంద‌ర్భంగా ఒక హోట‌ల్ విష‌యంలో వివ‌రాలు దాచి.. త‌ప్పుడు సాక్ష్యం చూపించిన న‌వాజ్ కుమార్తె పుణ్య‌మా అని తండ్రి కుర్చీ కింద‌కు నీళ్లు వ‌చ్చేశాయి. పాక్ ప్ర‌ధాని కుర్చీలో నుంచి న‌వాజ్ వైదొలిగితే భార‌త్‌ కు మ‌రింత ముప్పు వాటిల్లుతుంద‌ని చెబుతున్నారు. అలా ఎలా అంటే.. దానికున్న లాజిక్ ను వివ‌రిస్తున్నారు.

న‌వాజ్ కానీ త‌న ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేస్తే భార‌త్ ప‌రిస్థితి పెనం మీద నుంచిపొయ్యిలో ప‌డ్డ‌ట్లు అవుతుందంటున్నారు. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర‌సంస్థ‌లు మ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలుస్తోంది.

న‌వాజ్ కానీ త‌న ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేస్తే.. పాక్ లో ఆర్మీ పాల‌న వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదే జ‌రిగితే.. భార‌త్ మీద పాక్ సైన్యం కాలు దువ్వే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఈ ప‌రిణామం భార‌త్ భ‌ద్ర‌త‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని చెబుతున్నారు. న‌వాజ్ ప‌ద‌వి ఉండ‌టమా? పోవ‌ట‌మా అన్న‌ది వ‌చ్చే వారం పాక్ సుప్రీంకోర్టులో జ‌రిగే విచార‌ణ‌లో తేలుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.డాక్యుమెంట్ల ఫోర్జ‌రీ కేసును విచారిస్తున్న జిట్ బృందం సుప్రీంకోర్టుకు త‌న నివేదిక‌ను ఇస్తుంద‌ని.. అందులోని అంశాలే న‌వాజ్ రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌భావితం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.