Begin typing your search above and press return to search.

న‌వాజ్ బ‌డాయి మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   20 July 2017 4:57 AM GMT
న‌వాజ్ బ‌డాయి మాట‌లు విన్నారా?
X
భార‌త్‌కు దాయాదీ దేశంగా ఉన్న పాకిస్థాన్ ల‌డాయి త‌ర‌హా వైఖ‌రితోనే ముందుకు సాగుతోంది. వీల‌యితే త‌న భూభాగం మీదే పుట్టి పెరుగుతున్న ఉగ్ర‌వాదుల‌తో, లేదంటే త‌న సైనిక బ‌ల‌గాల‌తో స‌రిహ‌ద్దు వెంట ఉన్న భార‌త బంక‌ర్ల‌పై దాడుల‌తో విరుచుకుప‌డుతున్న పాకిస్థాన్‌... ఇటీవ‌ల మోదీ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ బెంబేలెత్తిపోయింది. త‌న‌లాగే భార‌త్ కూడా నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కితే... త‌న‌కు భారీ న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌న్న స‌త్యాన్ని గ్ర‌హించిన ఆ దేశ పాల‌కులు... అస‌లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌ర‌గ‌లేద‌ని ఒక‌సారి, త‌మ భూభాగంపై భార‌త సైన్యం విరుచుకుపడుతోంద‌ని మరోసారి నెత్తీనోరు బాదుకున్నా... ఆ దేశం మాట‌ల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం అస‌లు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఉగ్ర మూలాల‌ను అణ‌చివేసేందుకే తాను స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ కు దిగామంటూ భార‌త్ చెప్పిన వాద‌న‌కు అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా ఇత‌ర ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా... పాక్‌ కు త‌గిన బుద్ధి చెప్పారంటూ మోదీ భుజం త‌ట్టిన ప‌రిస్థితి.

భార‌త్‌ తో ఇంత‌టి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోయిన పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌... ఇప్పుడు ఆ కూపం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానా య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆ దేశ ప‌త్రిక‌లే లెక్క‌కు మిక్కిలి క‌థ‌నాలు రాసేస్తున్నాయి. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ అణ్వ‌స్త్ర పాట‌వంపై నిన్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ వ‌ద్ద కూడా అణు బాంబులు ఉన్నాయ‌న్న వాస్త‌వాన్ని అంత‌ర్జాతీయ స‌మాజం గుర్తించాలన్న కోణంలో ఆయ‌న చేసిన స‌ద‌రు ప్ర‌క‌ట‌న ఇప్పుడు నిజంగానే సంచ‌ల‌నంగా మారింది. నిన్న పాక్ లోని పంజాబ్ రాష్ట్రంలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆ దేశ ప‌త్రిక‌లు ప‌తాక శీర్షిక‌లు పెట్టి మ‌రీ అచ్చేశాయి.

అయినా న‌వాజ్ ష‌రీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న ఏంటంటే... అణు ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మైన త‌మ‌ను నిలువ‌రించేందుకు అగ్రరాజ్యం చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌ట‌. చివ‌ర‌కు నాటి అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ స్వ‌యంగా త‌న‌తో మాట్లాడార‌ని, అణు ప‌రీక్ష‌లు నిలిపివేస్తే... ఏకంగా 5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఇస్తామ‌ని చెప్పార‌ని ష‌రీఫ్ చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ తాను లొంగ‌లేద‌ని, అణు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేశామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. దేశానికి విధేయుడిని కాకుండా ఉండి ఉంటే... క్లింట‌న్ ఇచ్చిన 5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను తీసుకుని అణు ప‌రీక్ష‌ల‌ను నిలిపివేసేవాడిని క‌దా అంటూ ఆయ‌న త‌న వ్య‌క్తిత్వానికి తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. అయినా ఇది ఎప్పుడు జ‌రిగింద‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన ష‌రీఫ్.. 1998లో ఈ త‌ర‌హా ప్ర‌తిపాద‌న త‌న వ‌ద్ద‌కు క్లింట‌న్ నుంచి వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

తీవ్ర‌మైన‌ అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్న‌ నవాజ్ వాటినుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా? అన్న కోణంపై ఆలోచిస్తున్న క్ర‌మంలో ఆయ‌న నోట ఈ త‌ర‌హా పాత సంగ‌తులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందులో భాగంగా గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయ‌న‌ ఆయుధంగా వాడుకుంటున్నారు. పనామా పేపర్ల కుంభకోణం నేప‌థ్యంలో త‌న కుర్చీ కింద‌కే నీళ్లు వ‌స్తుండ‌టం, రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆయన ఇలా చేస్తున్నారని ప్వ‌యంగా పాకిస్తాన్‌ మీడియానే అంటోంది. మ‌రి త‌న దేశ మీడియా ప్ర‌శ్న‌ల‌కు ష‌రీఫ్ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.