Begin typing your search above and press return to search.

పాక్ ప్రధానికి ఇంటి పోరు కూడా మొద‌లైంద‌ట‌

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:10 AM GMT
పాక్ ప్రధానికి ఇంటి పోరు కూడా మొద‌లైంద‌ట‌
X
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. ఉరీ ఉగ్రఘటన తర్వాత ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఒక పక్క భారత్ జరిపిన సర్జికల్ దాడులతో పరువు పోగొట్టుకొని అవమాన భారం మిగిలగా.. మరోవైపు ఇది సరిపోదన్నట్లుగా ఇంటిపోరు తీవ్రతరమైంది. సర్జికల్ దాడులతో అందరికి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లోకి నవాజ్ ఇరుక్కుపోగా.. మరోవైపు పాక్ విపక్షనేత.. పాకిస్థాన్ తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ పార్టీ అధినేత.. మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ వైఖరి ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భారత్ నిర్వహించిన సర్జికల్ దాడి నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడేందుకు నవాజ్ షరీఫ్ సర్కారు పాక్ ఉభయ సభల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ పార్టీ నిరాకరించింది. తాము అసలు నవాజ్ ను పాక్ అధినేతగా గుర్తించటం లేదంటూ ఇమ్రాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవాజ్ ప్రభుత్వాన్నే తాము గుర్తించనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పాల్గొనే పరిస్థితే లేదని... ప్రస్తుత పార్లమెంటును తాము ఒప్పుకునే పరిస్థితే లేదని తేల్చేశారు.

పాక్ ప్రధానిగా నవాజ్ సరికాదని.. పాక్ సార్వభౌమాధికారాన్ని కాపాడలేకపోతున్న నవాజ్.. ప్రధాని పదవికి ఏ మాత్రం పనికి రాడని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. ఉరీ ఉగ్ర ఘటన నేపథ్యంలో సర్జికల్ దాడిని నిర్వహించిన భారత్ దెబ్బకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోగా.. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలు నవాజ్ సర్కారును దిక్కుతోచని పరిస్థతుల్లోకి నెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/