Begin typing your search above and press return to search.

పాక్ ప్రధాని ప్రవర్తన ఇలా ఉంది!

By:  Tupaki Desk   |   20 Sep 2016 5:42 AM GMT
పాక్ ప్రధాని ప్రవర్తన ఇలా ఉంది!
X
పొరుగుదేశంపై ఉగ్రవాదుల దాడి జరిగింది.. ఆ దేశమేమో తమపై ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని అనేవారెవరైనా కచ్చితంగా స్పందిస్తారు. ఆ పనిలో తమ ప్రమేయం ఉన్నా కూడా కనీసం "ఖండిస్తున్నాను" అనే మాటలైనా మాట్లాడతారు. కానీ.. భారత్ పై తాజాగా దాడి జరిగిన అనంతరం.. యురి సంఘటన పాక్ పనే అని భారత దేశం ఆరోపిస్తున్న సమయంలో కూడా మౌనాన్నే తన బాషగా చేసుకుంటున్నాడు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. భారత్ పై తాజాగా జరిగిన ఉగ్రవాద దాడి వెనక పాక్ హస్తం ఉందని అంటున్నారు? అని ప్రశ్నించిన జర్నలిస్టును ప్రెస్ మీట్ నుంచి బయటకు పంపేస్థాయిలో భయపడుతున్నాడు.

యురి దుర్ఘటన అనంతరం ఉగ్రవాదుల దాడిని మాటమాత్రానికైనా ఖండించని పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత్ కు చెందిన జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధి యురిదాడి గురించి ప్రశ్నించినప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ మీడియా ప్రతినిధిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందిగా ఆదేశించారు కూడా. దీంతో ఆయనను సమావేశం నుంచి బయటకు పంపారు. ఇది యురి ఉగ్రదాడి అనంతరం పాక్ ప్రధాని ప్రవర్తన. ఆ విషయంపై మాట్లాడలేదు సరికదా... కాశ్మీరు విషయంలో మాత్రం భారత్ పై తన విషప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఉపఖండంలో ఉద్రిక్తతలు కాశ్మీరు సమస్యే ప్రధాన కారణమని.. ఇది ప్రపంచ శాంతికి - భద్రతకు కూడా ముప్పుగా పరిణమించిందని చెప్పుకొస్తున్నారు. ఈ మేరకు భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా - రష్యా - చైనా - బ్రిటన్‌ - ఫ్రాన్స్‌ దేశాల అధిపతులకు లేఖ కూడా రాశాడు నవాజ్ షరీఫ్.

అంటే.. కశ్మీర్ సమస్యను పాక్ - భారత్ సమస్యగా కాకుండా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దీన్ని ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం పాక్ ప్రధాని షురూ చేశాడన్నమాట. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో ఈ నెల 21న ప్రసంగించనున్నారు షరీఫ్. ఆ సభలోనూ కాశ్మీరును ప్రస్తావిస్తామని గతంలోనే స్పష్టం చేసిన షరీఫ్.. భద్రతామండలి అంతర్జాతీయ సమస్యల్లో కాశ్మీరు చాలా పాతదని - శాశ్వత సభ్య దేశాలు దీనిని పరిష్కరించే బాధ్యత వహించాలని కోరుతున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడిన పాక్ ప్రధాని... యురి ఘటనపై కానీ, భారత్ ఆరోపణలపై కానీ స్పందించకపోవడం గమనార్హం.