Begin typing your search above and press return to search.

షాక్‌: రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో న‌క్స‌ల్స్‌

By:  Tupaki Desk   |   20 Sep 2018 12:13 PM GMT
షాక్‌: రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో న‌క్స‌ల్స్‌
X
స‌మ స‌మాజం కోసం.. అణ‌గారిన వ‌ర్గాల కోసం పోరాటమే త‌మ జీవిత ధ్యేయంగా కొన్ని ద‌శాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటానికి న‌క్స‌ల్స్ కొత్త ట‌చ్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయ నేత‌లు.. బ‌డా బాబులు.. వ్యాపార‌స్తులు.. పారిశ్రామిక‌వేత్త‌లు.. బ‌డా కాంట్రాక్ట‌ర్లు.. కొర్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే దృష్టి సారించే రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ లోకి న‌క్స‌ల్స్ పెట్టుబ‌డులు పెడుతున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

త‌మ‌కు న‌మ్మ‌క‌స్తులైన మాజీ కేడ‌ర్ ద్వారా తమ ద‌గ్గ‌ర ఉన్న నిధుల్ని రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టిస్తున్న వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మ అవ‌స‌రాల కోసం తాము పెట్టుబ‌డి పెట్టిన సొమ్మును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లుగా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లో ఏర్పాటు చేసిన ఒక ప్ర‌త్యేక విభాగం తాజాగా షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది.

తాజాగా ఈ సంస్థ విడుద‌ల చేసిన ఒక నివేదిక‌లో.. మావోల‌లో అగ్ర‌నేత‌ల పిల్ల‌ల‌కు విద్య‌.. ఇత‌ర అవ‌స‌రాల కోసం ఈ వ్యాపారంలో వ‌చ్చిన డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. న‌క్స‌ల్స్ త‌మ‌కు అందుతున్న మొత్తాల్ని ఏం చేస్తున్నారు? అన్న అంశంపై ద‌ర్యాప్తు చేసిన సంద‌ర్భంలో ఈ షాకింగ్ నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి.. న‌క్స‌ల్స్ ఫండింగ్ చేస్తున్న రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల మొత్తం ఎంత ఉంటుందో తెలిస్తే.. నోటి వెంట మాట రాని ప‌రిస్థితి.

ఒక నివేదిక ప్ర‌కారం ఈ విధంగా న‌క్స‌ల్స్ పెట్టిన పెట్టుబ‌డుల విలువ సుమారు రూ.12వేల కోట్ల మేర ఉంటుంద‌ని చెబుతున్నారు. తొలుత తాము సేక‌రించిన మొత్తాన్ని కొన్ని బోగ‌స్ సెల్ కంపెనీల్లో డిపాజిట్ చేస్తార‌ని.. ఆ త‌ర్వాత త‌మ మాజీ స‌భ్యుల‌కు ఇచ్చి.. మావో అగ్ర‌నేత‌ల ఖాతాల్లోకి మ‌ళ్లిస్తార‌ని చెబుతున్నారు. ఇలా తాము సేక‌రించిన మొత్తాన్ని హైద‌రాబాద్‌కు కూడా పంపుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

కొన్ని సంద‌ర్భాల్లో బెదిరించి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని సైతం ఇదే రీతిలో వినియోగిస్తార‌ని చెబుతున్నారు. మొత్తానికి డ‌బ్బు ఎవ‌రినైనా మారుస్తుంద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. తాజాగా న‌క్స‌ల్స్ సైతం వ్యాపారంలోకి దిగిన వైనం ఆస‌క్తిక‌రంగానే కాదు.. విస్మ‌యాన్ని రేకెత్తిస్తోంది.