Begin typing your search above and press return to search.

కేటీఆర్ స్థాయిని చెప్పేసిన నాయిని

By:  Tupaki Desk   |   2 May 2018 5:29 AM GMT
కేటీఆర్ స్థాయిని చెప్పేసిన నాయిని
X
కొంత‌మంది నేత‌లు ఉంటారు. వారే విష‌యాన్ని క‌డుపులో దాచుకోలేరు. అలా అని వారిని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌ని కూడా ఉండ‌దు. ఏదో చేద్దామ‌న్న ఆలోచ‌న‌తోనో.. మ‌రింకేదైనా ఉద్దేశంతో వారిలో ఉండ‌కున్నా.. త‌మ‌కు తెలిసిన విష‌యాన్ని న‌లుగురికి.. అది కూడా గొప్ప‌గా చెప్పాల‌న్న మంచి ఉద్దేశ‌మే ఉంటుంది. తాజాగా అలాంటి తీరుతోనే న‌లుగురు అనుకునే మాట నిజ‌మ‌ని తేల్చేసిన చందంగా మారింది. ఇంత‌కీ.. ఆ మాట‌ను చెప్పిందెవ‌రు?.. ఎవ‌రి గురించి ఆ విష‌యాన్ని చెప్పార‌న్నది చూస్తే..

కార్మిక నేత‌గా కెరీర్ షురూ చేసి.. అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌గా నాయిని నర్సింహా రెడ్డి ని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌ కు స‌న్నిహితంగా ఉండ‌ట‌మే కాదు.. విశ్వాసంగా ఉండ‌టంలోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. కేసీఆర్ కు ఎవ‌రికి వారు హ్యాండిస్తున్న వేళలోనూ.. అధినేత‌ను వ‌దిలి పెట్ట‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని తీరు ఆయ‌న సొంతం.

ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన విశ్వాసానికి.. విధేయ‌త‌కు త‌గ్గ‌ట్లే నాయిని హోంమంత్రి ప‌దవిని క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. అన‌వ‌స‌ర‌మైన ఆరోప‌ణ‌ల‌కు దూరంగా ఉండే ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న మాత్రం త‌ర‌చూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని చేయ‌టం క‌నిపిస్తుంది. అధినేత‌కు ఇబ్బంది పెట్ట‌కున్నా.. చిరాకు పుట్టించేలా ఆయ‌న కొన్ని వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజ‌కీయాల మీద త‌న‌కున్న ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిన కేసీఆర్‌.. తాను తెలంగాణ‌ను విడిచి పెట్ట‌టం లేద‌న్న విష‌యాన్ని అదే ప‌నిగా నొక్కి చెప్ప‌టం తెలిసిందే.

తెలంగాణ ప్ర‌జ‌ల మైండ్ సెట్ కు త‌గ్గ‌ట్లు త‌న వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్ కు ఇబ్బంది పెట్టేలా నాయిని తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఒక కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ తో క‌లిసి పాల్గొన్న నాయిని మాట్లాడుతూ.. మ‌న యువ‌నేత కాబోయే పెద్ద నాయ‌కుడు కేటీఆర్ అంటూ మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు. కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా కేటీఆర్ పేరు ఈ మ‌ధ్య‌న బ‌లంగా వినిపిస్తూ ఉంది.

పార్టీలో నెల‌కొనే ప‌రిణామాల దృష్ట్యా.. కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం చేసేందుకు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. కేటీఆర్ విష‌యాన్ని ఎక్క‌డా అన‌వ‌స‌రంగా తీసుకురావ‌టం క‌నిపించ‌దు అందుకు భిన్నంగా నాయిని నోట ఇప్పుడు కేటీఆర్ కు సంబంధించి చేసిన వ్యాఖ్య‌ల కీల‌కంగా చెబుతున్నారు.

ఇక‌.. ఉద్య‌మ నేత‌.. ఇటీవ‌ల రాజ‌కీయ పార్టీ పెట్టి కోదండం మాష్టారిని ఉద్దేశించి నాయిని కాస్త దూకుడు వ్యాఖ్య‌లు చేశార‌నే చెప్పాలి. మ‌మ్మ‌ల్ని ఓడించేందుకు ఒకాయ‌న పార్టీ పెట్టిండ‌ట‌.. నీ ఎంబ‌డి ఎవ‌రున్నారురా? జ‌నమంతా మా వెంట ఉన్న‌రంటూ కోదండ‌రాంను ఉద్దేశించి చేసిన విమ‌ర్శ‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. హోంమంత్రిగా ఉన్న నాయిని.. తొంద‌ర‌ప‌డి అనే మాట కార‌ణంలో అన‌వ‌స‌ర‌మైన డ్యామేజీ పార్టీకి జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. జ‌ర‌.. స్పీడ్ త‌గ్గిస్తే మంచిది నాయిని. బాస్ కు కోపం తెప్పించేలా ఎందుకు మాట్లాడ‌తారు చెప్పండి?