Begin typing your search above and press return to search.

నాయిని హుకుం:మీడియాపై కేసులు పెడ‌తాం

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:05 PM GMT
నాయిని హుకుం:మీడియాపై కేసులు పెడ‌తాం
X
తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మీడియాకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌మ ప్ర‌భుత్వంపై ఆరోపణల ఆధారంగా గాలివార్తలు ప్రసారం చేసినా, ప్రశ్నలు సంధించినా విలేకరులపై కేసులు పెట్టాల్సి వస్తుందని ప్ర‌క‌టించారు. హోంమంత్రి ఇంత ఆగ్ర‌హం ఎందుకు చెందారంటే...ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయిన‌ట్లు వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల‌ని విలేక‌రులు కోరినందుకు ఉగ్ర‌ న‌ర‌సింహుని రూపం దాల్చారు.

చంచల్‌ గూడ జైలు ఆవరణలో పదికోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఖైదీల కొత్త బ్యారక్‌ ను హోంమంత్రి నాయిని ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాలు వివ‌రించిన అనంత‌రం విలేక‌రులు స్పందిస్తూ కొత్త బ్యార‌క్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ప్రశ్నించారు. దీంతో హోం మంత్రి నాయిని విలేకరులపై విరుచుకు పడ్డారు. గాలివార్తల ఆధారంగా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టించాల్సి వస్తుందని హెచ్చరించారు.

బాధ్య‌తాయుత‌మైన హోంమంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి అన్నివ‌ర్గాల‌కు చెందిన శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సింది పోయి....ఆయ‌నే రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, పైగా బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం స‌రికాదనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.