Begin typing your search above and press return to search.

అలా చేస్తే అధికారుల్ని తన్నమంటున్న నాయిని

By:  Tupaki Desk   |   3 Nov 2015 4:57 AM GMT
అలా చేస్తే అధికారుల్ని తన్నమంటున్న నాయిని
X
తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ.. అలాంటి వాటిని వదిలేసి.. భౌతికదాడులకు పాల్పడమని కీలక స్థానాల్లో ఉండే వ్యక్తులే చెబితే ఏమనాలి? తాజాగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు ఇదే తీరులో ఉండటం గమనార్హం. ఎవరైనా అధికారులు లంచం అడిగితే కొట్టమని ఆయన పిలుపునివ్వటం గమనార్హం.

కార్మిక శాఖలో లంచం అడిగే కార్మికశాఖ అధికారుల్ని తన్నాల్సిందిగా హోంమంత్రి చెప్పటం సంచలనం రేపుతోంది. తన్నిన తర్వాత తనకు ఫిర్యాదు చేస్తే.. సదరు అధికారానికి సస్పెడ్ చేస్తామన్న భరోసా ఇవ్వటం గమనార్హం. కార్మిక సంఘం వార్షికోత్సవానికి హాజరైన నాయిని దృష్టికి అవినీతి ఉదంతాల్ని తీసుకొచ్చినప్పుడు ఆయనీ విధంగా స్పందించారు.

ఎంత అవినీతి పాల్పడితే మాత్రం.. వారిని తన్నేయాల్సిందిగా హోంమంత్రి స్థానంలో ఉన్న నాయిని చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేస్తే నిలదీయటం.. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటుందన్న భరోసా ఇవ్వటం మంచిదే తప్పించి.. తన్నండి.. కొట్టేయండంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా కొత్త సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకునేలా చూడాలే తప్పించి.. చట్టాన్ని ఎవరికి వారు తమ చేతుల్లో తీసుకోమన్నట్లుగా చెప్పటం అనవసరమైన సమస్యలకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక స్థానాల్లో ఉండి ఈ రెచ్చగొట్టుడేందో..?