Begin typing your search above and press return to search.

సారు టైం కోసం నాయిని తెగ ట్రై చేస్తున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:42 AM GMT
సారు టైం కోసం నాయిని తెగ ట్రై చేస్తున్నాడ‌ట‌
X
ఎంత గుచ్చి గుచ్చి అడిగినా.. రాజ‌కీయ నేత‌ల నోట్లో నుంచి నిజాలు ఒక ప‌ట్టాన బ‌య‌ట‌కు రావు. కానీ.. వారి మ‌న‌సుకు క‌ష్టం క‌లిగితే.. ఎవ‌రికీ చెప్ప‌కుండా భ‌ద్రంగా క‌డుపులో దాచుకున్న విష‌యాల‌న్ని ఒక్క‌సారిగా వ‌చ్చేస్తుంటాయి. తాజాగా తెలంగాణ తాజా మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ప‌రిస్థితి ఇదే తీరులో ఉంది.

తాజాగా ఆయ‌న బ‌ర‌స్ట్ అయ్యారు. అధినేత కేసీఆర్‌ ను అమితంగా ఆరాధించే నాయిని..తాజాగా మాత్రం ఆయ‌న‌లోని విధేయ‌త‌ను ఆవేద‌న అధిగ‌మించింది. అంతే.. ఇంత‌కాలం క‌డుపులో ఉన్న చాలా నిజాలు భ‌ళ్లున బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముషీరాబాద్ సీటును త‌న అల్లుడికి కేటాయించాల‌ని కేసీఆర్ ను నాయిని కోరారు. అయితే.. దానిపై త‌న స‌మాధానాన్ని చెప్ప‌ని కేసీఆర్‌.. మాట త‌ప్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయిని మ‌ళ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌ప‌కుండా ఉండిపోయారు.

దీంతో.. నాయిని ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ కు అంత క్లోజ్ గా ఉంటావు. అల్లుడికి సైతం టికెట్ ఇప్పుంచుకోలేవా? ఉద్య‌మంలో కీల‌క‌భాగ‌స్వామిగా ఉన్న నీ మాట‌ను సారు కాద‌న‌టం ఏమిటి? అస‌లు అల్లుడుగారికి టికెట్ ఇస్తారా? లేదా? కేసీఆర్ కు క్లోజ్ అయిన నీకే ఇలాంటి ప‌రిస్థితా? ఇలా.. త‌న చుట్టూ ఉన్న స‌న్నిహితులు సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక నాయిని ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

ఇలాంటివేళ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన నాయిని.. త‌న కడుపులోని ఆవేద‌న‌ను క‌క్కేశారు. అల్లుడికి టికెట్ ఇస్తారా? లేదా? అన్న మాట‌ను ప‌లువురు అడుగుతున్నార‌ని.. త‌న‌కు చాలా తిక‌మ‌క అవుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముషీరాబాద్ టికెట్ ను త‌న అల్లుడు శ్రీ‌నివాస్ రెడ్డికి ఇవ్వాల‌ని కేసీఆర్ ను కోరార‌ని.. ఒక‌వేళ ఇబ్బంది ఉంటే త‌న‌కు ఇవ్వాల‌న్నారు.

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకోవాలంటూ శ్రీ‌నివాస్ రెడ్డికి కేసీఆర్ ఏడాది క్రిత‌మే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. త‌న అల్లుడు టికెట్ కోసం తానిప్ప‌టికే రెండుసార్లు కేటీఆర్ ను క‌లిసిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న‌తో మాట్లాడిన త‌ర్వాతే ముషీరాబాద్ టికెట్‌ను ఫైన‌ల్ చేస్తామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

2014లో తాను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే వ‌ద్ద‌ని.. తాను పోటీ చేస్తే ఏదోలా ఓడిస్తార‌ని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. "వ‌ద్దు న‌ర్స‌న్నా.. నిన్ను గ‌తంలో ఓడించారు. నువ్వు.. ఈసారి ఎల్ బీ న‌గ‌ర్ నుంచి పోటీ చేయాల‌ని కేసీఆర్ చెప్పారు. బాగా డ‌బ్బులున్న సుధీర్ రెడ్డి మీద పోటీ చేయ‌లేన‌ని చెప్పా. నీ త‌మ్ముడిని నేనున్నా.. రూ.10 కోట్లు ఇస్తా.. పోటీ చేయ్యి" అని చెప్పిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. అనంత‌రం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న‌కు అవ‌కాశం ఇచ్చి.. మంత్రిని చేశార‌న్నారు. తాను కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని.. క‌లిసిన‌ప్పుడు అన్ని విష‌యాలు తాను చెప్ప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇలా.. అన్ని విష‌యాలు చెప్పేస్తే కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరుకుతుందంటావా నాయిని?