Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను నాయిని తిట్టాడా? పొగిడాడా?

By:  Tupaki Desk   |   30 Aug 2015 6:14 AM GMT
కేసీఆర్‌ ను నాయిని తిట్టాడా?  పొగిడాడా?
X
మలిద‌శ తెలంగాణ ఉద్య‌మం నుంచి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్న నాయ‌కుల్లో నాయిని న‌ర్సింహారెడ్డి ఒక‌రు. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల త‌ర్వాత పార్టీలో ముఖ్య‌నాయకుడిగా నాయినికి ఓ గౌర‌వం ఉంది. అందుకే ఆయ‌న‌కు కీల‌క‌మైన హోంశాఖ‌ను కేసీఆర్ క‌ట్ట‌బెట్టారు. అలాంటి నాయిని తాజాగా ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై స్పందించారు. అయితే అది కేసీఆర్‌ కు విమ‌ర్శించిన‌ట్లుందా లేక స‌మ‌ర్థించిన‌ట్లుందా అనేదే అర్థం కాని ప‌రిస్థితి.

వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వరంగల్‌ జిల్లాలోని 265 గ్రామాల్లో గుడుంబాను నిర్మూలించడమేకాకుండా, తయారీని అడ్డుకోవాలని మహిళలు తీర్మానించిన సంగ‌తిని విలేక‌రులు ప్ర‌స్తావించారు. ‘‘ఇది మహిళా చైతన్యానికి నిదర్శనం. మిగతా 9 జిల్లాల్లోనూ మహిళలు ఉద్యమించి, చీప్‌ లిక్కర్‌ ను వ్యతిరేకిస్తే, దీనిని నిలిపివేస్తాం. ప్రజాభిప్రాయమే మా అభిప్రాయం’’ అని నాయిని ప్రకటించారు. ‘మహిళలు, ప్రజలు, ప్రజా సంఘాలు వద్దంటే చీప్‌ లిక్కర్‌ పై మా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాం’ అని కూడా నాయిని ప్రకటించారు.

చీప్‌ లిక్కర్‌ ను అంతా వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అంటున్నాయి కాబట్టి, దానిపైనా మా ప్రభుత్వం కూడా ఆలోచించాలని నాయిని అన్నారు. " ముఖ్యమంత్రితో ఈ విషయం చెబుతాను. ఆయన కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా అవసరమైతే కేబినెట్‌ లో చర్చిస్తాం. పునరాలోచిస్తాం. మా హైకమాండ్‌ ఢిల్లీలో లేదు. ప్రజలే మా హైకమాండ్‌. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రతి జిల్లా నుంచి సమాచారం సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచన క్రమంలోనే.. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని అనుకొన్నదేగానీ, చీక్‌ లిక్కర్‌ చేయాలనే యోచ‌న లేదని నాయిని తెలిపారు. గుడుంబాను బంద్‌ చేసి ప్రజలకు మరే ప్రత్యామ్నాయం లేకపోతే వారిలో ఏమైనా తప్పుడు ఆలోచనలు వస్తాయేమోనని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. సమాజంలోని మంచిచెడులను అర్థం చేసుకొనే శక్తి గల ముఖ్యమంత్రి దొరకడం మా తెలంగాణకు అదృష్టం’’ అని నాయిని వ్యాఖ్యానించారు.

అయితే మ‌హిళా లోకం నుంచి వ్య‌తిరేక‌త వచ్చే చీప్‌ లిక్క‌ర్ వంటి అంశాన్ని కేసీఆర్ కేబినెట్‌ లో చ‌ర్చించ‌కుండానే ఆమోదం తెలిపారా? మ‌ంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు మాట‌మాత్రం అయినా కేసీఆర్ వివ‌రించలేదా? అలా చెప్పిన స‌మ‌యంలో వ్య‌తిరేకించ‌ని నాయిని ఇపుడు సీఎంకు చెప్తాన‌న‌టం ఏంటి? సామాజిక తత్వ‌వేత్త అయిన కేసీఆర్ మ‌హిళ‌ల మ‌నోభావాలు తెలియ‌వా? అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.