Begin typing your search above and press return to search.

సుశీల్ యవ్వారం నాయిని మాటల్లో..

By:  Tupaki Desk   |   7 March 2016 4:11 AM GMT
సుశీల్ యవ్వారం నాయిని మాటల్లో..
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఒక కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు పుత్రరత్నం సుశీల్ కుమార్ ఒక మహిళను వేధింపులకు గురి చేసిన వైనంపై ఆయన్ను స్పందించమని మీడియా కోరినప్పుడు ఆయన విషయాన్ని చాలా తేలిగ్గా తేల్చేశారు. మంత్రిగారి అబ్బాయిని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. నాయిని మాటలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఇష్యూ మీద నాయిని ఏమన్నారన్న విషయంలోకి వెళితే..

‘‘అదో చిల్లర వ్యవహారం. పోరగాడు అమ్మాయి చెయ్యి పట్టి లాగిండు. మా స్థాయిలో జోక్యం చేసేమేముంది? మా పోలీసులకు అన్ని విషయాలు బాగా తెలుసు. వాళ్లే చూసుకుంటారు. ఎవ్వరి డైరెక్షన్ లో నడుచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు సొంత డైరెక్షన్ ఉంది’’ అంటూ తేల్చేశారు. రావెల కొడుకును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జోక్యం కారణంగానే తన కుమారుడ్ని టార్గెట్ చేశారన్న వ్యాఖ్యలపై నాయిని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తీవ్ర కలకలాన్ని రేపిన మంత్రిగారి అబ్బాయి ఇష్యూను నాయిని చాలా సింఫుల్ గా తేల్చేసినట్లు కనిపిస్తోంది.

నిజానికి నాయిని చెప్పినట్లుగా ఈ యవ్వారం చిల్లరదే అయితే.. మంత్రులే ఎందుకు స్పందించాల్సి వస్తోంది. ఇక.. సుశీల్ బెయిల్ కోసం ఏపీ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగంలో దిగాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ వ్యవహారాల్ని చూసుకోవాల్సిన ఆయన.. మంత్రిగారి అబ్బాయి చేసిన వెధవపనికి సంబంధించి బెయిల్ తీసుకొచ్చేలా ప్రయత్నం చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. ప్రముఖులకు సంబంధించిన విషయాన్ని చాలా చిన్న వ్యవహారంగా తేల్చేయటం ద్వారా.. తామీ విషయాన్ని అస్సలు పట్టించుకోవటం లేదన్నట్లుగా నాయిని తేల్చిసినప్పటికీ.. ఆయన చెప్పినంత తేలిగ్గా వ్యవహారాలు ఉండవన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఒక కేసు విషయంలో నాయిని స్పందన ఈ తరహాలో ఉండటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.