Begin typing your search above and press return to search.

కేసీఆర్ టార్గెట్‌ గా నాయిని వ్యాఖ్య‌లు... టీఆర్ఎస్‌ లో క‌ల‌క‌లం..

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:36 PM GMT
కేసీఆర్ టార్గెట్‌ గా నాయిని వ్యాఖ్య‌లు... టీఆర్ఎస్‌ లో క‌ల‌క‌లం..
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఆర్టీసీ స‌మ్మె ఒక్క‌ సారిగా రేపిన ప్ర‌కంప‌న‌లను కేసీఆర్ మెల్లగా చ‌ల్లార్చేశారు. ప్ర‌స్తుతానికి ఆర్టీసీ స‌మ్మె సుఖాంత‌మైంది. తాజాగా కార్మికులతో జ‌రిగిన స‌మావేశం లో మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు అవి అధికార టీఆర్ఎస్‌ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక గ‌తేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల టైం నుంచి నాయిని కేసీఆర్‌పై త‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

త‌న‌కు ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వి, త‌న అల్లుడి కి కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ మాట త‌ప్పార‌ని ఆయ‌న అప్ప‌ట్లోనే తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. ఇక గ‌తంలోనే కేసీఆర్ నాయినికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌దవి ఇస్తాన‌న్నా.. అందులో ర‌సం లేద‌ని.. అది త‌న‌కు వ‌ద్ద‌ని కూడా నాయిని మీడియా మొఖం మీదే చెప్పేశారు. ఇక తాజాగా ఆయ‌న ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో కార్మిక సంఘాల నాయ‌కుల‌తో మాట్లాడుతూ ప్ర‌భుత్వాలు వివిధ సంస్థ‌ల నుంచి యూనియ‌న్ల‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని నాయిని అన్న‌ట్టు స‌మాచారం.

ఏ కంపెనీ అభివృద్ధి చెందేందుకు అయినా కార్మికుడే ముఖ్యం... అలాగే ప్ర‌జ‌లు లేకుండా ఏ ప్ర‌భుత్వం న‌డ‌వదు... ఇక అభివృద్ధిలో కీల‌క‌మైన కార్మికుల గొంతును అణిచి వేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోందంటూ నాయిని ప‌రోక్షంగా కేసీఆర్‌పై త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. ఇక ఉద్యోగికి క‌నీస వేత‌నం ఇవ్వాల‌ని గ‌త ప్ర‌భుత్వం వేసిన క‌మిటీ ఓ నివేదిక రెడీ చేసింది... ఇది ఆమోదం పొందే ముందే మీడియా కు లీక్ అయ్యింద‌ని.. కొన్ని కంపెనీల మేనేజ్‌మెంట్లు దీనిని ఆమోదించ‌వ‌ద్ద‌ని కేసీఆర్‌ను కోర‌డంతో ఇది ఆగిపోయింద‌ని నాయిని చెప్పార‌ట‌.

దీనిని ఆమోదింప‌జేసేందుకు గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో కేసీఆర్‌ ను ఒప్పించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశాన‌ని.. చివ‌ర‌కు తాను ఈ విష‌యం లో విఫ‌ల‌మ‌య్యాన‌ని కూడా నాయిని వాపోయార‌ని తెలిసింది. ఏదేమైనా నాయిని కేసీఆర్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో నాయినిని ప‌క్క‌న పెట్టిన కేసీఆర్‌, ఆయ‌న అల్లుడి కి ముషీరాబాద్ సీటు కూడా ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి ఆయ‌న త‌న అసంతృప్తిని బ‌హిర్గతం చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్‌లో గులాబీ జెండాకు తానూ ఓన‌ర్‌నే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అప్పటి నుంచి ఆయ‌న కేసీఆర్‌ పై త‌న అసంతృప్తి ని ఏదో ఒక రూపంలో వ్య‌క్తం చేస్తూనే వ‌స్తున్నారు. మ‌రి నాయిని తాజా వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో ? చూడాలి.