Begin typing your search above and press return to search.

అమెరికన్లకూ ట్రంప్ నచ్చలేదు..

By:  Tupaki Desk   |   25 Feb 2017 8:48 AM GMT
అమెరికన్లకూ ట్రంప్ నచ్చలేదు..
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిలిస్తున్న విద్వేషాన్ని ఎంత మంది ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే.. విద్వేషాన్ని వ్యతిరేకించేవారు ఏమీ చేయలేకపోవడంతో విద్వేషంతో విషం కక్కుతున్నవారి తుపాకుల గర్జన ఆగడం లేదు. ‘‘వి లవ్ ట్రంప్ హేట్రెడ్’’ అంటూ అమెరికాలో వెలుస్తున్న పోస్టర్లు ట్రంప్ అనుకూల ముఠాలు ఎలా పెరుగుతున్నాయో చెబుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 916 జాతి విద్వేష ముఠాలు పనిచేస్తున్నాయి. వీరంతా ఇతర దేశస్థులను అవమానించడం.. దూషించడం.. దాడులు చేయడం.. దోచుకోవడం... ఆడవాళ్లనైతే లైంగికంగా దాడి చేయడం.. ఒక్కోసారి తుపాకీతో కాల్చిచంపడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడే పెద్ద విద్వేష నేరగాడు కావడంతో ఈ ముఠాల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ నెల రోజుల పాలనపై వచ్చిన సర్వే నివేదికలు అసలు విషయాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ట్రంప్ పాలనను మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్న విషయం మరోసారి బయటపడింది. అంతేకాదు.. వచ్చే నాలుగేళ్లలో అమెరికాను ట్రంప్ నాశనం చేయడం గ్యారంటీ అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మెజారిటీ అమెరికన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 53 శాతం మంది అమెరికన్లు ట్రంప్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తున్నారు. 'ట్రంప్ నెల రోజుల పాలన ఎలా ఉంది?' అనే అంశంపై ఎన్ బీసీ న్యూస్ - సర్వే మంకీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ పాలన పట్ల కేవలం అసంతృప్తితోనే కాదు, తీవ్ర భయాందోళనల్లో కూడా ఆ దేశ మెజారిటీ పౌరులు ఉన్నారు.

రానున్న నాలుగేళ్ల కాలంలో అమెరికా ఓ పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుందని వారు భయపడుతున్నారు. ఇది అమెరికా భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని వారు భావిస్తున్నారు. ట్రంప్ పాలనపై 30 శాతం మంది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏడు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం 50 శాతం మంది మద్దతు తెలపడం విశేషం. కాగా అమెరికాలో అశాంతి - హింస భారీగా పెరిగే ప్రమాదముందని అమెరికన్లు ఇప్పుడు తెగ ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి ట్రంప్ ను చూసి ప్రపంచమే కాదు అమెరికన్లూ వణికిపోతున్నారన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/