Begin typing your search above and press return to search.

పీతలన్న మంత్రికి పీతలతోనే బుద్దిచెప్పారు

By:  Tupaki Desk   |   10 July 2019 4:44 AM GMT
పీతలన్న మంత్రికి పీతలతోనే బుద్దిచెప్పారు
X
ప్రాజెక్ట్ ఎలా కూలిపోయిందయ్యా అంటే కాంట్రాక్టర్ నాణ్యతలేమీతో చేసిన పనుల వల్ల కాదని.. వర్షాలతో వచ్చిన పీతల వల్ల అని మహారాష్ట్ర మంత్రి ఈ మధ్య సెలవిచ్చారు. పీతలు ప్రాజెక్టుకు బొక్కపెట్టడం వల్లే చీలి కూలిపోయిందన్నారు. ఈ మాటలు దుమారం రేపాయి. నీటి జీవులపై అభాండం మోపి ప్రాజెక్టు నాణ్యత లేమీతో నిర్మించిన వారిని తప్పుపట్టకపోవడంతో ఆ మంత్రిపై విమర్శలు చెలరేగాయి. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఇలా ప్రాజెక్టు కూలడానికి పీతలను కారణంగా చూపిన ఆ మంత్రికి అదే పీతలతో ప్రతిపక్షాలు బుద్ది చెప్పడం విశేషం. తాజాగా నిరసనకారులు సదురు మంత్రి ఇంట్లో పెద్ద ఎత్తున పీతలను తీసుకొచ్చి రాసులుగా పోసి ఆందోళన చేశారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యామ్ కు గండిపడింది. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ మాత్రం కాంట్రాక్టరు నాణ్యతలేమీతో పనులు చేయడం వల్ల కాదని.. పెద్దఎత్తున వర్షానికి కొట్టుకువచ్చిన పీతలు ప్రాజెక్టు కట్టకు బొరియలు చేసి గుడ్లు పెట్టడం వల్లే ఇలా జరిగిందని మాట్లాడడం వివాదాస్పదమైంది. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడంపై సామాన్యులు - విపక్ష నేతలు భగ్గుమన్నారు.

2004లో తివారీ డ్యామ్ నిర్మించారు. గత పదిహేనేళ్లుగా నీటిని నిల్వ చేస్తున్నారు. అప్పటి నుంచి లీకులు లేవు. అయితే మంత్రి ఇలా కాంట్రాక్టర్లను కాపాడడానికి పీతలపై నెపం నెట్టడంతో ప్రతిపక్ష ఎన్సీపీ - విపక్షాలు మండిపడ్డాయి. ఏకంగా మంత్రి ఇంటికి వెళ్లి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన పీతలను ఆయన ఇంటి ముందు.. ఇంట్లో గుమ్మరించి నిరసన తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన తెలిపారు.