Begin typing your search above and press return to search.

అవిశ్వాస నోటీసుల్లో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఎన్డీఏ!

By:  Tupaki Desk   |   29 March 2018 1:01 PM GMT
అవిశ్వాస నోటీసుల్లో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఎన్డీఏ!
X
పార్ల‌మెంటులో వైసీపీ - టీడీపీ ల‌తో స‌హా మ‌రికొన్ని పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే స‌భ ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. స‌భ‌లో స‌భ్యుల ప‌లుమార్లు పోడియం ను చుట్టుముట్టడం - వెల్ లోకి దూసుకురావ‌డం వంటివి చేయ‌డంతో స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ‌ను వాయిదా వేశారు. బుధ‌వారం నాడు ఇచ్చిన నోటీసుతో క‌లిపి అవిశ్వాసం నోటీసుల సంఖ్య 8కి చేరింది. దీంతో - అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చను నిరాకరించడంలో యుపిఎ స‌ర్కార్ రికార్డును ఎన్డీఎ ప్రభుత్వం బద్దలు కొట్టింది. అవిశ్వాసం నోటీసుపై చర్చను ఎక్కువ సార్లు నిరాకరించిన ఘ‌న‌త మోదీ స‌ర్కార్ కు ద‌క్కింది. గ‌తంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో యుపిఎ ప్రభుత్వం నిర్ణయానికి వ్య‌తిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ - లగడపాటి రాజగోపాల్ - రాయపాటి సాంబశివ రావు - సాయి ప్రతాప్ - సబ్బం హరి - జీవీ హర్షకుమార్ అవిశ్వాస తీర్మానానికి 2013 - డిసెంబ‌రు 9న నోటీసులు ఇచ్చారు.

దీంతో - వారిని యుపిఎ స‌ర్కార్ బ‌హిష్క‌రించింది. 2013 డిసెంబర్ 18వరకు వారు ప్రతిరోజూ ఇచ్చిన‌ నోటీసుల‌ను అప్పటి స్పీకర్ మీరా కుమార్ తిర‌స్క‌రించారు. 7 ప‌ని దినాల్లో వారు ఇచ్చిన నోటీసుల రికార్డును తాజ‌గా మోదీ స‌ర్కార్ (8సార్లు) బ‌ద్ద‌లు కొట్టింది. యుపిఎ పేరిట ఉన్న మ‌రో రికార్డును కూడా ఎన్డీఏ బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశ‌ముంది. 2014 - ఫిబ్రవరి 5 నుంచి 18 వ‌ర‌కు వరుసగా 9 ప‌ని దినాల్లో అప్ప‌టి కాంగ్రెస్ ఎంపీలు యుపిఎపై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నాడు సుమిత్రా మహాజన్ అవిశ్వాసంపై నోటీసులను చర్చకు తీసుకోకపోతే ఆ రికార్డు....ఎన్డీఏ పేరిట చేరుతుంది. కాగా, అత్య‌ధికంగా అవిశ్వాస తీర్మానాల‌ను ఎదుర్కొన్న ప్ర‌ధానిగా ఇందిరా గాంధీ పేరు పొందారు.