Begin typing your search above and press return to search.

కమలానికి అక్కడ ఏడాదికే ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   18 Dec 2015 5:33 AM GMT
కమలానికి అక్కడ ఏడాదికే ఎదురుదెబ్బ
X
సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయఢంకా మోగించిన మోడీ బ్యాచ్ కు.. ఆ తర్వాత కాలం పెద్దగా కలిసి వస్తున్నట్లు లేదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. ఉప ఎన్నికల్లోనూ ప్రోత్సాహకర వాతావరణం కనిపించిన దాఖలాల్లేవు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో కమలానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

ఈ మధ్యకాలంలో వరుసగా ఎదురవుతున్న ఎన్నికల షాకులకు తాజా ఫలితం ఒక కొనసాగింపుగా చప్పాలి. జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్టీ ఎమ్మెల్యే కమల్ కిశోర్ భగత్ కు గతంలో ఒక వైద్యుడి మీద దాడి చేసిన కేసు ఉంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆయనకు ఐదేళ్ల జైలుశిక్ష పడటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

దీంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా.. సదరు ఎమ్మెల్యే కిశోర్ భగత్ సతీమణి నిరు శాంతిని బరిలోకి దింపారు. అయితే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుఖ్ దేవ్ భగత్ 23,228 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల ఎదురుదెబ్బల గురించి కమలనాథులు కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.