Begin typing your search above and press return to search.

మోదీ త‌గ్గ‌లేదు!... కానీ రాహుల్ పెరిగార‌ట‌!

By:  Tupaki Desk   |   26 Jan 2018 12:40 PM GMT
మోదీ త‌గ్గ‌లేదు!... కానీ రాహుల్ పెరిగార‌ట‌!
X
ఇంకో ఏడాది ఉంటే... సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతాయి. నాలుగేళ్ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు సంచ‌ల‌న తీర్పు చెప్పారు. అప్ప‌టిదాకా ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏను గ‌ద్దె దించిన జ‌నం... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారుకు పాల‌నా ప‌గ్గాలు అప్ప‌గించారు. వెర‌సి ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ ఎన్నిక‌లు మూడు ద‌శాబ్దాల భార‌త రాజ‌కీయ చ‌రిత్ర‌ను తిరగ‌రాశాయ‌నే చెప్పాలి. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం సంపూర్ణ మెజారిటీతో ప్ర‌భుత్వం ఏర్పాటు కాగా... మళ్లీ 30 ఏళ్ల త‌ర్వాత న‌రేంద్ర మోదీ నేతృత్వంలోనే సంపూర్ణ మెజారిటీతో ప్ర‌భుత్వం కొలువుదీరింద‌న్న మాట‌. మ‌రి త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఏమిట‌న్న దిశ‌గా అప్పుడే స‌ర్వేలు మొద‌లైపోయాయి. ఈ స‌ర్వేల‌న్నీ మ‌రోమారు ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీకే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌గా... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు ద‌క్కిన ఓట్లు - సీట్ల సంఖ్య‌లో మాత్రం మార్పు త‌ప్ప‌ద‌న్న లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా... ఏడాది త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగినా... పీఎం పీఠం మోదీకే ఖాయమ‌ట‌. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు మ‌రోమారు కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ట‌. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అత్యంత పేల‌వ ప్ర‌ద‌ర్శ‌నతో డీలా ప‌డిపోయిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు కొత్త‌గా జ‌వ‌జీవాలు మాత్రం నిండ‌నున్నాయ‌ట‌. లోక్ స‌భ‌లో క‌నీసం ప‌దో వంతు సంఖ్య‌లో సీట్ల‌ను కూడా సంపాదించ‌లేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ... స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కోల్పోయింది. అయితే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల త‌ర్వాత ఆ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కలిగిన మ‌రో పార్టీ స‌భ‌లో లేక‌పోవ‌డంతో చివ‌రాఖ‌రుకు ఆ పార్టీనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌లేదు. ఇంత‌గా డీలా ప‌డిపోయిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికారం చేతికంద‌కున్నా... గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థాయిలో సీట్లు మాత్రం ఖాయ‌మేన‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో 50 సీట్లు కూడా గ‌గ‌నంగా మారితే.. ఈ ద‌ఫా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మూడంకెల సీట్లు మాత్రం ఖాయ‌మ‌న్న స‌ర్వేలు వెలువడుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 132 దాకా సీట్లు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ట‌. అదే స‌మ‌యంలో ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ కూట‌మికి 202 సీట్ల దాకా వ‌స్తాయ‌ట‌.

మ‌రి కాంగ్రెస్ పార్టీకి - ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూట‌మికి సీట్లు పెరిగితే... ఆటోమేటిక్‌ గా బీజేపీకి - దాని ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ కూట‌మికి సీట్లు త‌గ్గ‌డం ఖాయ‌మే క‌దా. నిజ‌మే మ‌రి.. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే... ఎన్డీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా కూడా గ‌తంలో వ‌చ్చిన‌న్ని సీట్లు మాత్రం రావ‌ట‌. గ‌డ‌చిన ఎన్నికల్లో ఎన్డీఏకు 336 సీట్లు వ‌చ్చాయి. వీటిలో బీజేపీ సింగిల్ గా సాధించిన సీట్లే 282. అంటే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ 272 అయితే... నాడు ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో అవ‌స‌రం లేకుండా బీజేపీనే ఒంట‌రిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగినంత మేర సీట్ల‌ను సాధించింద‌న్న మాట‌. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఏమిటన్న విష‌యానికి వ‌స్తే... బీజేపీకి ఈ 293 నుంచి 309 సీట్ల మ‌ధ్య వ‌స్తాయ‌ట‌. ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే... ఈ ద‌ఫా ఆ పార్టీకి 258 సీట్ల దాకా వ‌స్తాయట‌.

అంటే గ‌తంతో మాదిరిగా ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో నిమిత్తం లేకుండా బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేద‌న్న మాట‌. అంటే ఎన్డీఏలోని మిగిలిన భాగ‌స్వామ్య ప‌క్షాలకు మోదీ త‌న కేబినెట్‌లో మ‌రింత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్న మాట‌. అంటే ఈ నాలుగేళ్ల‌లో చాలా డేర్‌ గా నిర్ణ‌యాలు తీసుకున్నంత మేర మోదీ... రానున్న ఐదేళ్ల‌లో ముందుకు సాగ‌లేర‌న్న మాట‌. ఇదిలా ఉంటే... త‌దుప‌రి ప్ర‌ధానిగా ఎవ‌రైతే బాగుంటుంద‌న్న విష‌యంపై జ‌రిగిన స‌ర్వేలో న‌రేంద్ర మోదీకే జ‌నం ప‌ట్టం క‌ట్టారు. 53 శాతం మంది ఈ విష‌యంలో మోదీకి ఓటేయ‌గా... రాహుల్ గాంధీకి 22 శాతం మంది మాత్ర‌మే ఓటేశారు. ఇక కొత్త‌గా ప్ర‌ధాని రేసులోకి రాహుల్ సోద‌రి ప్రియాంకా గాంధీ కూడా వ‌చ్చేశారు. 4 శాతం ఓట్ల‌తో ప్ర‌ధాని రేసులో ప్రియాంకా మూడో స్థానంలో ఉన్నారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ 3 శాతం ఓట్ల‌తో నాలుగో స్థానంలో ఉన్నారు.