Begin typing your search above and press return to search.

ద్రౌపది పర్యటనలో క్లారిటీ వస్తుందా ?

By:  Tupaki Desk   |   9 July 2022 5:30 AM GMT
ద్రౌపది పర్యటనలో క్లారిటీ వస్తుందా ?
X
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈనెల 12వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల్లో మద్దతు కోరుతూ ద్రౌపది వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయే పార్టీల మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో ఆమె కీలకమైన నేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి కూడా వస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ ప్రకారమైతే వివిధ పార్టీలకున్న ప్రజాప్రతినిధుల ఓట్ల విలువను కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది.

ఎలక్టోరల్ కాలేజీ ప్రకటన ప్రకారం 22 మంది ఎంపీలు, 151 ఎంఎల్ఏల ఓట్ల విలువ సుమారు 50 వేల దాకా ఉంది. ఇదే సమయంలో ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎంఎల్ఏల ఓట్ల విలువ చాలా తక్కువుంది.

ఈ ఎంఎల్ఏల్లో కూడా నలుగురు జారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నలుగురు ఎంఎల్ఏల ఓట్లవిలువకు గండిపడినట్లయ్యింది. ఇప్పటికే ద్రౌపదికి మద్దతు ప్రకటిస్తు జగన్ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వైసీపీ విషయంలో క్లారిటి ఉంది.

ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు నుండి ఎలాంటి నిర్ణయం వినబడలేదు. టీడీపీ మద్దతు ద్రౌపదికా లేకపోతే నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హాకా అన్న విషయంలో స్పష్టత లేదు.

12వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్న ద్రౌపది తన పర్యటనలో జగన్ తో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతుందంటున్నారు. మరి ఇదే సమయంలో ఆమె చంద్రబాబుతో కూడా భేటీ అవుతారా ? అన్న విషయంలో క్లారిటీ రావాల్సుంది.

ద్రౌపది పర్యటనలో టీడీపీ మద్దతు విషయంలో క్లారిటీ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఓట్ల విలువ ఆధారంగా తీసుకుంటే ద్రౌపదికి టీడీపీ మద్దతిచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. కాకపోతే అందరినీ కలవటమన్నది ద్రౌపది కనీస బాద్యత. ఎందుకంటే టీడీపీ ఎన్డీయేలో కానీ లేకపోతే నాన్ ఎన్డీయే పార్టీల కూటమికి కానీ మద్దతు ఇవ్వటం లేదు. అందుకనే చంద్రబాబును ద్రౌపది కలిసే అవకాశముంది.