Begin typing your search above and press return to search.

మోడీ ప‌రివారానికి మ‌రో మిత్రుడు గుడ్ బై?

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:19 AM GMT
మోడీ ప‌రివారానికి మ‌రో మిత్రుడు గుడ్ బై?
X
మిత్రుడేమీ మిర్చి బ‌జ్జీ లాంటోడు కాదు. ఐదు రూపాయిలు ఇస్తే ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ దొర‌క‌టానికి. భావ సారూప్యంతో పాటు మ‌రెన్నో క‌ల‌వాల్సి ఉంటుంది. ఇక‌.. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మిత్ర‌త్వం అంటూ ఎన్నో అంశాలు ముడిప‌డి ఉంటాయి. అయితే.. క‌లిసి వ‌చ్చిన మిత్రుల‌ను ఒక్కొక్క‌రుగా దూరంగా చేసుకోవ‌టంలో మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

గ‌తంలో బీజేపీ అన్నంత‌నే రాజ‌కీయ అస్పృశ్య‌ పార్టీగా ముద్ర ప‌డ‌ట‌మే కాదు.. ఆ పార్టీతో చేతులు క‌లిపేందుకు.. దోస్తానా చేసేందుకు ఏ మాత్రం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించే వారు కాదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. సెక్యుల‌ర్ పార్టీ కాద‌ని.. మ‌త‌త‌త్వ పార్టీగా ముద్ర వేసి దూరంగా ఉండేవారు. అయితే.. ఒక్కొక్క‌టిగా బీజేపీ గూట్లోకి తీసుకొచ్చిన మోడీ.. ఇప్పుడు వారిని విడిచిపెడుతున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ఎన్డీయేకు ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తు ఇచ్చినోళ్లు.. నైతికంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప‌లు పార్టీలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున దూరం కావ‌టం తెలిసిందే. తాజాగా మ‌రో పార్టీ మోడీ ప‌రివారానికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. బీహార్ లో బీజేపీ ప‌వ‌ర్లోకి వ‌చ్చేందుకు కార‌ణ‌మైన మిత్ర‌ప‌క్షం తాజాగా క‌మ‌ల‌నాథుల‌తో క‌టీఫ్ చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

మ‌రికొద్ది నెలల్లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన సీట్ల స‌ర్దుబాట్ల‌ పై రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి.. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా తాజాగా ఎల్ జేడీ అధినేత శ‌ర‌ద్ యాద‌వ్ తో క‌లిసి భేటీ అయ్యారు. తాజా ప‌రిణామంతో మ‌రో మిత్రుడు మోడీ ప‌రివారానికి దూరం కానున్న‌ట్లుగా చెబుతున్నారు. 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆర్ ఎస్ ఎల్ పీకి మూడు సీట్ల‌ను కేటాయించిన జేడీయూ-బీజేపీ కూట‌మి.. ఈసారి అన్ని సీట్లు ఇవ్వ‌లేమ‌ని సంకేతాలు ఇవ్వ‌టంతో బీజేపీతో క‌టీఫ్ దిశ‌గా ఆ పార్టీ అడుగులు ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక్కో పార్టీతో ఒక్కో కార‌ణంతో దూర‌మ‌వుతున్న మోడీ ప‌రివారం.. చివ‌ర‌కు రెండు మూడు పార్టీల మ‌ద్ద‌తు మాత్ర‌మే ఉంటుంద‌ని.. ఏకాకి కావ‌టానికి ఎక్కువ స‌మ‌యం అక్క‌ర్లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మోడీ సాబ్‌.. ఎందుకిలాంటి త‌ప్పులు చేస్తున్న‌ట్లు?