Begin typing your search above and press return to search.

సీబీఐతో కుప్ప‌కూలిన ఎన్డీటీవీ షేరు

By:  Tupaki Desk   |   5 Jun 2017 1:04 PM GMT
సీబీఐతో కుప్ప‌కూలిన ఎన్డీటీవీ షేరు
X
గ‌తంలో మీడియా సంస్థ‌లంటే దాన్నో వ్యాపారంగా కంటే కూడా దాన్నో వ్యాప‌కంగా నిర్వ‌హించేవారు. అందుకోసం త‌మ ఆస్తుల్ని సైతం ప‌ణంగా పెట్టుకున్నోళ్లు కోకొల్ల‌లు. అందుకే.. స‌మాజంలో మ‌రే రంగానికి లేనంత మ‌ర్యాద‌.. మ‌న్న‌న‌.. భ‌యం.. భ‌క్తి.. ఆద‌ర‌ణ‌.. ఆరాధ‌న అన్ని మీడియాకు ఉండేవి. మారిన కాలంతో పాటు.. మీడియా తీరు మారింద‌న్న‌ది న‌మ్మాల్సిన నిజం.

చాలావ‌ర‌కూ అగ్ర‌శ్రేణి మీడియా సంస్థ‌లు.. త‌మ‌ది వ్యాపారంగానే చూస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మాట‌ను ఒప్పుకోరు కానీ.. వారు వేసే అడుగులు వేసే ధోర‌ణిని చూస్తే.. అదెలా వ్యాపారంగా మారిందో ఇట్టే తెలిసిపోతుంది. స‌మ‌స్య ఏమిటంటే.. మీడియా సంస్థ‌ను వ్యాపార సంస్థ‌గా భావిస్తారో.. ఆ క్ష‌ణం నుంచి అన్ని ర‌కాల భ‌యాలు.. జాగ్ర‌త్త‌లు వ‌చ్చేస్తాయి. రాజీ ప‌డ‌టం కూడా మొద‌ల‌వుతుంది. దీంతో.. మీడియా ప‌ని మీడియా చేయ‌లేని ప‌రిస్థితి. ఇదంతా ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న చూసిన‌ప్పుడు.. ఒక‌ మీడియా సంస్థ‌కు అనుకోనిది ఏదైనా ఎదురైతే.. ఫ‌లితాలు ఎంత దారుణంగా ఉంటాయి.. ఆర్థికంగా ఎంత న‌ష్టం వాటిల్లుతుందో తెలియ‌జెప్పే ఘ‌ట‌న‌గా తాజా ఉదంతాన్ని చెప్పాలి.

ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల న‌ష్టాన్ని క‌లిగించార‌న్న ఆరోప‌ణ‌ల మీద సీబీఐ కేసు న‌మోదు చేసి ఎన్డీటీవీ వ్య‌వ‌స్థాప‌కుడు.. స‌హ ఛైర్మ‌న్ ప్ర‌ణ‌య్ రాయ్‌.. ఆయ‌న స‌తీమ‌ణి రాధికా రాయ్ ల‌కు చెందిన ఆస్తుల‌పై సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తుంద‌న్న వార్త‌లురావ‌టం సంచ‌ల‌నంగా మారింది. టీవీ.. వెబ్ సైట్.. న్యూస్ యాప్ ఫార్మాట్ల‌లో అగ్ర‌శ్రేణి మీడియా సంస్థ‌గా పేరున్న ఒక మీడియా సంస్థ‌పై సీబీఐ దాడులు నిర్వ‌హిస్తుంద‌న్న వార్త‌లు మీడియా వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపాయి. ఈ అంశంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. సీబీఐ త‌నిఖీల వార్త‌తో ఎన్టీడీవీ షేర్లు మార్కెట్లో దారుణంగా కుప్ప‌కూలాయి. ప్ర‌తి చిన్న అంశానికి తీవ్రంగా ప్ర‌భావితం అయ్యే స్టాక్ మార్కెట్లో.. ఒక మీడియా సంస్థ మీద సీబీఐ దాడులు నిర్వ‌హిస్తోంద‌న్న మాట‌తో ఆ సంస్థ షేరు దారుణంగా దెబ్బ తింది. సీబీఐ త‌నిఖీల వార్త‌ల‌తో ఆందోళ‌న‌ల‌కు గురైన ఇన్వెస్ట‌ర్లు త‌మ ద‌గ్గ‌రున్న ఎన్డీటీవీ షేర్ల‌ను అమ్మ‌టం మొద‌లెట్టారు.

దీంతో.. ఈ షేరు దాదాపుగా 7 శాతానికి న‌ష్ట‌పోయింది. దీంతో.. భారీ న‌ష్టాల‌తో 52 వారాల క‌నిష్ఠ స్థాయికి ప‌డిపోయింది. ఎన్డీటీవీపై సీబీఐ దాడుల్ని ఆ మీడియా సంస్థ తీవ్రంగా ఖండించింది. మ‌రోవైపు వివిధ ప‌త్రికాధిప‌తులు తీవ్ర దిగ్భాంత్రిని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే తాజా సోదాలు చేప‌ట్టిన‌ట్లుగా సీబీఐ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. సీబీఐ త‌నిఖీల‌న్న ఒక్క వార్త‌.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆర్థిక ప‌రిపుష్టి మీద భారీ ప్ర‌భావాన్ని చూపించింద‌న‌టంతో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/