Begin typing your search above and press return to search.

ట్రంప్ పై 100 దిగ్గజకంపనీల లీగల్ వార్

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:13 AM GMT
ట్రంప్ పై 100 దిగ్గజకంపనీల లీగల్ వార్
X
వివాదాస్పద నిర్ణయాలతో అగ్గి పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై టెక్ దిగ్గజాలు ఇప్పటికే వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వలస ఉత్తర్వులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టెక్ దిగ్గజ ప్రముఖులు ఒక్కటై.. ట్రంప్ తీరును న్యాయపరంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. టెక్ దిగ్గజ కంపెనీలకు మరిన్ని దిగ్గజ కంపెనీలు కలిశాయి. మొత్తంగా వంద దిగ్గజకంపెనీలు ఒక్కతాటి మీదకు రావటమే కాదు.. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ఇవి తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లేలా చేస్తాయంటూ కోర్టుకు ఎక్కాయి.

మైక్రోసాఫ్ట్.. గూగుల్.. యాపిల్ సహా సిలికాన్ వ్యాలీకి చెందిన వంద ప్రముఖ కంపెనీలు ఫెడరల్ అప్పీళ్ల కోర్టులో పిటీషన్ ను దాఖలు చేశాయి. తమకు బాగా పరిచయం ఉన్న అన్నింటిని వదిలేసి తెలియని ప్రదేశానికి వచ్చే ప్రజల్లో సహజంగానే సృజనాత్మకత.. సంకల్పబలం.. ధైర్యం ఉంటాయని పేర్కొన్న దిగ్గజ కంపెనీలు.. వలసలు.. ఆర్థిక వృద్ధికి దగ్గరగా ముడిపడి ఉన్న అంశాల్ని.. అంతర్జాతీయ ప్రతిభను ఆకట్టుకునే అమెరికా సామర్థ్యానికి తాజా ఉత్తర్వులు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.

ట్రంప్ ఉత్తర్వులను పునరుద్ధరించాలని అమెరికా ప్రభుత్వం చేసిన అత్యవసర వినతిని వంద సంస్థలు ఖండించాయి. జాయింట్ వెంయర్ అనే మేధో సంస్థ నివేదిక ప్రకారం సిలికాన్ వ్యాలీలో పని చేసే సిబ్బందిలో 37 శాతం మంది విదేశీయులేనని అంచనా వేసింది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపార దిగ్గజ కంపెనీలు అమెరికా అద్యక్షుడి నిర్ణయంపై కోర్టుకు వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఉత్కంటగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/