Begin typing your search above and press return to search.

అవసరం ఎంత పనైనా చేయిస్తుంది.. అంతేనా మంత్రివర్యా?

By:  Tupaki Desk   |   16 Jan 2023 6:30 AM GMT
అవసరం ఎంత పనైనా చేయిస్తుంది.. అంతేనా మంత్రివర్యా?
X
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులపై తెలంగాణ నేతలు ఎన్ని రకాలుగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారో తెలియంది కాదు. టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ మొదలుకుని ఆ పార్టీ నేతలంతా ఆంధ్రా సంస్కృతిని, భాషను, ఆహారాన్ని ఇలా అన్నింటిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఏకంగా బ్రిటిషర్లతో ఆంధ్రా వాళ్లను పోల్చి వలస పాలకులని దూషించారు.

ఇక కరోనా సమయంలో ఏపీ నుంచి అంబులెన్సుల్లో వెళ్తున్న రోగులను తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకుని వెనక్కి తిప్పి పంపించేశారు. ఇప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల్లో అక్రమంగా విద్యుత్‌ ను ఉత్పత్తి చేసుకుంటూ ఆంధ్రా ప్రయోజనాలకు గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టును సైతం సరిగా సాగనీయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారు. భద్రాచలం మునుగుతుందని.. ఇంకా అనేక తెలంగాణ గ్రామాలు మునుగుతాయని ఇలా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే విభజన తర్వాత ఏపీకి రావాల్సిన ఆస్తులు, రూ.6 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను సైతం తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు.

అయితే ఇప్పుడు తెలంగాణ బీఆర్‌ఎస్‌ నేతల స్వరాల్లో మార్పు వచ్చింది. అవసరం ఎంత పనైనా చేయిస్తుంది అన్నట్టు ఇప్పుడు ఆంధ్రుల విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అంటున్నారు. తమ బీఆర్‌ఎస్‌ పార్టీని దేశమంతా విస్తరించే పనిలో ఉన్న ఆ పార్టీ నేతలకు ఆంధ్రులపై ఆకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది.

ఈ క్రమంలోనే విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏపీపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రజలు మాత్రం కలిసే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అంతా కలిసే ఉన్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్తు చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఇప్పటికీ మా మనసులు కలిసే ఉన్నాయన్నారు.

ఇదే శ్రీనివాస్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌ ఉద్యమ సమయంలో ఏపీ ఉద్యోగులు, ఏపీ ప్రజలపై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఉన్నాయి.

అయితే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏపీలో ఓట్లు అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన స్వరం కూడా మారింది. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా జీవిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ నేతలు ఆంధ్రులపై ఇంకెంత ప్రేమ చూపిస్తారోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.