Begin typing your search above and press return to search.

సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినప్పుడు సాయం చేసే.. '155260'

By:  Tupaki Desk   |   29 July 2021 3:35 AM GMT
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినప్పుడు సాయం చేసే.. 155260
X
సైబర్ నేరాలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీ.. అందుకు తగ్గట్లుగా లేని అవగాహనతో పాటు.. బలహీనతలు.. అత్యాశ.. ఇట్టే డబ్బులు సంపాదించే గోల్డెన్ ఛాన్సు తమను వెతుక్కుంటూ వచ్చిందన్న ఆనందంతో తప్పులో కాలేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.. ఇప్పుడు నమోదయ్యే సైబర్ నేరాల్లో అత్యధిక ఆర్థిక సంబంధమైన నేరాలే కావటం గమనార్హం. ఇలాంటి వేళ.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలు పని చేసే ఒక హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘155260’.. ఈ నెంబరుతో సైబర్ నేరస్తుల బారిన పడే వారికి అంతో ఇంతో ఊరట కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది.

మిగిలిన నేరాలకు సైబర్ నేరాలకు ఉన్న తేడా ఏమంటే.. నేరస్తుడు మన పక్కనే ఉండొచ్చు.. లేదంటే అల్లంత దూరాన వేరే రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో ఉండొచ్చు. దీంతో.. పలువురి భాగస్వామ్యం ఉంటే తప్పించి నేరగాళ్ల భరతం పట్టలేమన్న విషయాన్ని గుర్తించిన హోం శాఖ.. చాలా ఆలస్యంగా నిద్ర లేచిందని చెప్పాలి. 2000 సంవత్సరం తర్వాత అంతకంతకూ పెరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలు గణనీయంగా నమోదవుతున్నాయి. ఇదే విషయం తాజా గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.

దేశంలోని 29 రాష్ట్రాలను భాగస్వాములుగా చేసిన హోంమంత్రిత్వ శాఖ అధికారులు.. వాటిని నాలుగు ప్రాంతీయ మండళ్లుగా వర్గీకరించారు. దేశంలో ఎక్కడ సైబర్ నేరం జరిగినా.. వారిని వీలైనంత త్వరగా అరెస్టు చేయటం.. వారు దోచేసిన డబ్బును రికవరీ చేయాలన్న లక్ష్యంతో ఈ కొత్త హెల్ప్ లైన్ నెంబరును తీసుకొచ్చారు. తాజాగా చేసిన ఏర్పాటుతో సైబర్ నేరస్తులో ఉచ్చులో చిక్కిన వారు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు.. తమకు జరిగిన మోసం గురించి గంటల వ్యవధిలో సైబర్ పోలీసులకు సమాచారం అందిస్తే.. వారికి సాయం చేయటం సులువు అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే కన్నా.. ‘155260’నెంబరుకు ఫోన్ చేయటం ద్వారా.. నేరస్తుల్ని ఇట్టే పట్టుకునేలా చేయొచ్చు.

ఒక అంచనా ప్రకారం సైబర్ నేరస్తుల బారిన పడి మోసపోతున్న వారిలో కేవలం 20 శాతం మందే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే.. మిగిలిన 80 శాతం మందికి మేలు జరిగేందుకు వీలుగా తాజా టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. అయితే కాల్ సెంటర్ కు కానీ లేదంటే.. www.cybercreime.gov.inకు ఆన్ లైన్ లో కంప్లైంట్ చేయటం ద్వారా.. నేరస్తుల్ని పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.
www.cybercreime.gov.inకు ఆన్ లైన్ లో కంప్లైంట్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో కేసు ఐడీ నెంబరు ఉంటుంది. దాని ఆధారంగా నేరం చోటు చేసుకున్న 24 గంటల వ్యవధిలో www.cybercrime.gov.inకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా సైబర్ నేరాల్లో నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకోవటం.. శిక్ష విధించటంతోపాటు బాధితుడికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయటం చాలా కష్టమన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంలో ఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకున్న వారికి డబ్బులు తిరిగి వచ్చేలా చేసే అవకాశం ఉందని చెబతున్నారు. దీనికి చేయాల్సిందల్లా నేరం జరిగిన గంటల్లోనే పోలీసులకు సమాచారం ఇవ్వటం. దీంతో రంగప్రవేశం చేసే పోలీసులు నేరస్తులు కొట్టేసిన డబ్బును వ్యాలెట్ లేదంటే బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోకుండా ఆపేస్తారు.

ఫిర్యాదులో బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఏ వ్యాలెట్ కు బదిలీ అయ్యిందో తెలుసుకొని.. సంబంధిత బ్యాంకుకు కానీ.. వ్యాలెట్ నిర్వాహకులకు సమాచారం అందించి డబ్బులు డ్రా చేయకుండా ఆపే వీలుంది. అయితే.. ఇందుకు చేయాల్సిందల్లా బాధితులు.. మోసపోయిన వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే.. ‘155260’నెంబరును మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.