Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌ప్రదేశ్ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని!

By:  Tupaki Desk   |   26 March 2021 5:17 PM GMT
ఆంధ్ర‌ప్రదేశ్ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని!
X
ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

మొత్తం ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయగా.. పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నీలం సాహ్నిని నియామకానికి ఆమోద ముద్ర వేశారు.

1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సాహ్ని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌చిలీప‌ట్నంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గా విధులు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత టెక్క‌లి స‌బ్ క‌లెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్గొండ జాయింట్ క‌లెక్ట‌ర్‌, ఆ త‌ర్వా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేపట్టారు. నిజామాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల్లోనూ సాహ్ని విధులు నిర్వ‌ర్తించారు.

నీలం సాహ్ని మునిసిప‌ల్ ప‌రిపాల‌నా విభాగం డిప్యూటీ సెక్ర‌ట‌రీగా, మ‌హిళా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ గానూ ప‌నిచేశారు. కుటుంబ సంక్షేమ‌శాఖ‌లోని ప‌లు విభాగాల్లో ప‌నిచేసిన సాహ్ని.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శిగానూ విధులు నిర్వ‌ర్తంచారు.

అంతేకాకుండా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏపీఐడీసీ కార్పొరేష‌న్ వీసీ అండ్‌ ఎండీగా ప‌నిచేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభ‌జ‌న త‌ర్వాత.. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి, ఈ మ‌ధ్య‌నే ఉద్యోగ విర‌మ‌ణ పొందారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాన స‌ల‌హాదారుగా నియ‌మితులైన సాహ్ని.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.