Begin typing your search above and press return to search.

నీలి బెండపూడి.. మన తెలుగోళ్లకు తాజా గర్వకారణం

By:  Tupaki Desk   |   11 Dec 2021 1:00 PM IST
నీలి బెండపూడి.. మన తెలుగోళ్లకు తాజా గర్వకారణం
X
దేశం కాని దేశానికి వెళ్లటమే గొప్ప విజయంగా భావిస్తారు. అలాంటిది ఆ దేశంలో తనదైన మార్కును వేయటం..అక్కడున్న పోటీని అధిగమించి.. అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు.

అందునా.. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఒకటైన పెన్సిల్వేనియా వర్సిటీకి అధ్యక్షురాలిగా నీలి బెండపూడి ఎంపిక కావటం మామూలు విషయం కాదు. ఈ అద్భుతాన్ని సాధించింది ఒక తెలుగు మహిళ కావటానికి మించిన సంతోషం తెలుగు వారికి ఏం ఉంటుంది?

తాజాగా ఆమె పెన్సిల్వేనియా వర్సిటీకి అధ్యక్షురాలిగా నీలి బెండపూడి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది శీతాకాలంలో ఆమె వర్సిటీకి 19వ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతను శ్వేతజాతీయులే చేపట్టారు.

తొలిసారిగా శ్వేతేతర జాతి వ్యక్తిగా ఆమె రికార్డును క్రియేట్ చేశారు. అంతేకాదు.. వర్సిటీకి అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎంపిక కావటం కూడా ఇదే తొలిసారి కావటం మర విశేషంగా చెప్పాలి.

ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన ఆమె.. 1986లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆమె.. యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ కు డీన్ గా.. అనంతరం వీసీగా పని చేశారు. పలు వర్సిటీల్లో పని చేసిన ఆమె లూయివిల్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షరాలిగా.. ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు.

దాదాపుగా 30 ఏళ్ల నుంచి మార్కెటింగ్ విభాగంలో బోధించటమే కాదు.. కాన్సస్ వర్సిటీలో అత్యున్నత అధికారిగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ గా.. వర్సిటీ ఆఫ్ కాన్సాస్ లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ గా.. ఓహియో స్టేట్ వర్సిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పెన్సిల్వేనియా వర్సిటీ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయమని.. ఈ అత్యుత్తమ విద్యార్థులు.. అధ్యాపకులు.. సిబ్బందితో కలిసి పని చేయటాన్ని తానెంతో గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. పెన్ స్టేట్ వర్సిటీ కొత్త శిఖరాలకు చేరుకునేలా పని చేయటమే తన ధ్యేయంగా ఆమె వెల్లడించారు.

తన వృత్తిని విద్యార్థులకు అంకితం చేసిన ఆమె విద్యా రంగంలో మంచి అనుభవం ఉంది. తాజాగా ఆమె సాధించిన విజయానికి తెలుగు ప్రజలంతా సంతోషించటమేకాదు.. గర్వపడే ఘనతను సాధించారని చెప్పాలి.