Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రి నీరజ్ చోప్రా క్రేజ్ ఎంత భారీగా పెరిగిపోయిందో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:14 AM GMT
రాత్రికి రాత్రి నీరజ్ చోప్రా క్రేజ్ ఎంత భారీగా పెరిగిపోయిందో తెలుసా?
X
ఒకే ఒక్క గెలుపు. అది కూడా ఆషామాషీ గెలుపు కాదు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని రికార్డును క్రియేట్ చేసేలా ఉన్న విజయం సొంతమైనప్పుడు సదరు క్రీడాకారుడి ఇమేజ్ ఎంతలా పెరిగిపోతుంది? రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ను ఎలా సొంతం చేసుకుంటాడన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మారారు ఒలింపిక్ లో స్వర్ణాన్ని సాధించిన నీరజ్ చోప్రా. అతగాడికి అభిమానులు అంతకంతకూ ఎక్కువైపోతున్నారు. తమ జీవితంలో జావెలిన్ త్రో గురించి తెలీని వారు.. ఆ ఆట గురించి అవగాహన లేని వారు.. దాన్నో క్రీడాగా గుర్తించని కోట్లాది మంది ఇప్పుడు నీరజ్ చేసిన మేజిక్ కు ఫిదా అయిపోతున్నారు.

తాను పాల్గొన్న మొదటి ఒలింపిక్స్ లోనే స్వర్ణాన్ని కైవశం చేసుకోవటమే కాదు.. భారతీయ తొలి అథ్లెట్ గా.. వ్యక్తిగత ప్రతిభతో స్వర్ణాన్ని సాధించిన రెండో క్రీడాకుడిగా నీరజ్ క్రేజ్ రాత్రికి రాత్రే అమాంతం పెరిగిపోయింది. అతగాడి ఇమేజ్ ఎంతలా పెరిగిందనటానికి గతంలో అయితే కొలిచే వేదికలు లేవు. ఇప్పుడా లోటు లేదనే చెప్పాలి. అతగాడి వార్తల్ని కవర్ చేసే మీడియా అతని స్టేటస్ ఏమిటన్న విషయాన్ని చెప్పేస్తే.. సోషల్ మీడియా మాత్రంప్రజల్లో అతనికి పెరిగిన పలుకుబడి ఎంతన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తోంది.

జావెలిన్ త్రో గేమ్ లో విజయం సాధిస్తే.. మొదటి పేజీలో ఎనిమిది కాలమ్స్ తో వార్త పెట్టటమా? అసలు అలాంటిది ఒకటి జరుగుతుందని ఎప్పుడైనా.. ఏ రోజైనా కలగన్నారా? అలాంటి అనూహ్య కల వాస్తవరూపం దాల్చటమే కాదు.. ఇప్పుడు ఆ ఆట మీద క్రేజ్ తో పాటు.. ఆ ఆటగాడైన నీరజ్ చోప్రా మీద అభిమానం భారీగా పెరిగిపోయింది. రాత్రికి రాత్రి అతని సోషల్ మీడియా ఖాతాలో అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఇన్ స్టాలో నీరజ్ చోప్రా ఖాతాలోకి 10 లక్షల మందికి పైగా అభిమానులు యాడ్ అయ్యారు. ఆయన్ను ఫాలో అవుతుండటం చూస్తే.. 23 ఏళ్ల ఈ క్రీడాకారుడి ఇమేజ్ ఎంతలా మారిందన్న విషయాన్ని స్పష్టమవుతుందని చెప్పొచ్చు.

టోక్యోలో జరిగిన ఫైనల్ లో అతడు స్వర్ణాన్ని సాధించినట్లుగా వార్తలు వచ్చిన కాసేపటి నుంచే అతగాడి ఇన్ స్టా పేజీని దర్శించే వారి సంఖ్య పెరిగిపోవటమే కాదు.. అతడ్ని ఫాలో కావటం ఎక్కువైంది. 87.58 మీటర్ల దూరానికి తన ఈటెను విసిరిన నీరజ్.. మరో ఘనతను మూటగట్టుకున్నాడు. ఫైనల్ లో విసిరిన రెండో అత్యధిక దూరం ఇదేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. దేశానికి తొలి స్వర్ణాన్ని తీసుకొచ్చిన నీరజ్ కు హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్ల నజరానాను ప్రకటిస్తే.. వివిధ రాష్ట్రాలు అతనికి ప్రోత్సహాకాల్ని ప్రకటించాయి.చివరకు భారత క్రికెట్ నియంత్రణా మండలి సైతం అతనికి భారీ నజరానాను ప్రకటించింది. నీరజ్ సాధించిన ఘనత ఏ పాటిదన్న విషయం తాజా విజయం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.