Begin typing your search above and press return to search.

తల్లిదండ్రుల చిరు కోరిక నెరవేర్చిన నీరజ్ చోప్రా ..ఏమిటంటే

By:  Tupaki Desk   |   11 Sep 2021 11:46 AM GMT
తల్లిదండ్రుల చిరు కోరిక నెరవేర్చిన నీరజ్ చోప్రా ..ఏమిటంటే
X
నీరజ్ చోప్రా .. గత కొద్ది రోజుల ముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ , నీరజ్ చోప్రా అన్న పేరు ఇప్పుడు దేశంలో ఏ మూలకి వెళ్లి అడిగినా అతనో గొప్ప యోధుడు అని చెప్తారు. అథ్లెటిక్స్‌లో భారతదేశపు ఏకైక ఒలింపిక్ బంగారు పథకం అందుకున్నాడు. పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు అనుభవించే ఆనందమే వేరు. బిడ్డలు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటే వారి సంబరం అంబరాన్నంటుంది. అదే సమయంలో తమ తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చేందుకు వారు చేసే ప్రయత్నాలు ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.

గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా తన తల్లిదండ్రులకు ఇలాంటి ఆనందాన్నే అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ లో పసిడిని ముద్దాడిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డు సాధించి, తన ఎదుగులకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు, కోచ్‌ లు సాయం అందించిన ప్రభుత్వాలకు అరుదైన కానుక అందించాడు. ఇక నీరజ్‌ చోప్రా తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ ను తొలిసారిగా విమానం ఎక్కించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను శనివారం షేర్‌ చేసిన నీరజ్‌.. నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక నీరజ్‌ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఫొటోలను సేవ్‌ చేసుకోండి ఫ్రెండ్స్‌. మీరెప్పుడైనా ఒత్తిడికి లోనైనా, నిరుత్సాహానికి గురైనా ఈ ఫొటోలను చూడండి. అన్నీ చిటికెలో మాయమైపోతాయి. నువ్వు సూపర్‌ నీరజ్‌ భాయ్‌. ఈ ప్రపంచంలోని సంతోషమంతా నీ పేరెంట్స్‌ కళ్లలోనే కనిపిస్తోంది అంటూ ప్రశంసిస్తున్నారు.

టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఫైనల్‌ లో నీరజ్ 87.58 మీటర్లు విసిరి ఒలింపిక్ స్వర్ణం సాధించాడు. అయితే, అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి స్టార్ అథ్లెట్‌ గా మారిపోయాడు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి పెద్ద ఈవెంట్‌ లలో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. టోక్యో నుంచి తిరిగొచ్చిన తరువాత అనారోగ్యం కారణంగా నేను శిక్షణను తిరిగి ప్రారంభించలేకపోయాను. నా టీమ్‌ తో పాటు, 2021 కాంపిటీషన్ సీజన్‌ కి కొంత సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. 2022 లో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌ లో రాణించేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాం అని నీరజ్ తెలిపాడు.