Begin typing your search above and press return to search.

చ‌ల్లార‌ని నీట్ విద్యార్థినుల బ్రాల తొల‌గింపు వివాదం!

By:  Tupaki Desk   |   19 July 2022 5:32 AM GMT
చ‌ల్లార‌ని నీట్ విద్యార్థినుల బ్రాల తొల‌గింపు వివాదం!
X
జూలై 17న ఆదివారం దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప‌రీక్ష కేర‌ళ‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంతోపాటు మ‌రో ప‌రీక్ష కేంద్రంలో ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థినుల బ్రాలు తొల‌గించాకే ప‌రీక్ష కేంద్రం నిర్వాహ‌కులు వారిని ప‌రీక్ష రాయ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డంపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిబంధ‌న‌ల పేరుతో తిరువ‌నంత‌పురంలో నీట్ రాసిన 100 అమ్మాయిల బ్రాల‌ను విప్పించాకే నిర్వాహ‌కులు ప‌రీక్ష రాయ‌నిచ్చారు.

అందులోనూ తిరువ‌నంత‌పురం పరీక్ష కేంద్రంలో మొత్తం పురుష ఇన్విజిలేట‌ర్లే ఉన్నార‌ని.. లోప‌ల బ్రాలు లేకుండానే 100 మంది విద్యార్థినులు 3 గంటల 20 నిమిషాల‌పాటు ప‌రీక్ష రాయాల్సి వ‌చ్చింద‌ని విద్యార్థినులు బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌ల్లిదండ్రుల‌తో చెప్పుకుని విల‌పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ప‌రీక్ష కేంద్రం నిర్వాహ‌కుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇంత అవమానానికి గురైన విద్యార్థినులంద‌రూ విపరీతమైన ఒత్తిడికి లోన‌య్యార‌ని.. మాన‌సికంగా చితికిపోయిన విద్యార్థినులు ప‌రీక్ష కూడా స‌రిగా రాయ‌లేక‌పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా నిబంధ‌నల మేర‌కే తాము ఇలా చేశామ‌ని.. విద్యార్థినుల‌ను స్క్రీనింగ్ చేసి తాము లోప‌ల‌కు పంపేట‌ప్పుడు వారి బ్రాల‌కు బెల్టులు (మెట‌ల్ ప‌దార్థాలు) ఉన్నాయ‌ని.. అందువ‌ల్లే వాటిని తొల‌గించాల‌ని కోరామ‌ని నిర్వాహ‌కులు స‌మ‌ర్థించుకుంటున్నారు.

మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారంలో త‌మ త‌ప్పేమీ లేద‌ని క‌ళాశాల యాజ‌మాన్యం చెబుతోంది. పరీక్ష కోసం త‌మ క‌ళాశాల‌ను వాడుకున్నార‌ని.. త‌మ సిబ్బంది ఎవ‌రూ నీట్ ప‌రీక్ష విధుల్లో లేర‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప‌రీక్ష నిర్వ‌హించింద‌ని.. వారి సిబ్బంది ప‌రీక్ష విధుల్లో ఉన్నార‌ని పేర్కొంది.