Begin typing your search above and press return to search.

నెహ్రూ క్రిమినల్..ఆయన నేరం వల్లే కశ్మీర్ ఇలా అయింది

By:  Tupaki Desk   |   11 Aug 2019 8:23 AM GMT
నెహ్రూ క్రిమినల్..ఆయన నేరం వల్లే కశ్మీర్ ఇలా అయింది
X
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌ సింగ్ చౌహాన్ సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూ ఒక పెద్ద క్రిమినల్ అని... ఆయన వల్లే దేశానికి అన్యాయం జరిగిందని.. కశ్మీర్‌ కు జరిగిన అన్యాయానికి నెహ్రూదే పూర్తి బాధ్యత అని చౌహాన్ మండిపడ్డారు. నెహ్రూ కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుని వుండకపోయి వుంటే కాశ్మీర్ పూర్తిగా భారత్ సొంతమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత సైన్యం కాశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రూ కాల్పుల విరమణను ప్రకటించి.. తొలి నేరానికి పాల్పడ్డారని.. అందువల్ల కశ్మీర్‌ లో మూడొంతుల భూభాగం పాక్ చేతిలోకి వెళ్లిందని చౌహాన్ గుర్తు చేశారు. నెహ్రూ కనుక కొద్దిరోజులు మౌనంగా ఉండి..కాల్పుల విరమణ ప్రకటించి వుండకపోతే కాశ్మీర్ భారత్ ఆధీనంలోనే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జమ్మూకాశ్మీర్‌ లో ఆర్టికల్ 370ని తీసుకువచ్చి నెహ్రూ రెండో నేరం చేశారని ఆరోపించారు. అందువల్ల ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్ధితి నెలకొందని.. ఇది దేశానికి చేసిన అన్యాయమే కాదని నేరం కూడా అని ఆరోపించారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం కశ్మీర్‌ - లదాఖ్‌ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా నెహ్రు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నెహ్రూ చేసిన తప్పును ఇప్పుడు మోదీ సరిదిద్దారంటూ అమిత్ షా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ మరో అడుగు ముందుకేసి నెహ్రూను ఏకంగా క్రిమినల్ అనడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.